Warm Water | మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో వేళకు భోజనం చేయడం, నిద్రించడం, వ్యాయామం చేయడం కూడా అంతే అవసరం. ఇక వీటితోపాటు రోజుకు తగినన్న నీళ్లను కూడా తాగాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఆయుర్వేద ప్రకారం గోరు వెచ్చని నీటిని తాగడం ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. రోజూ సాధారణ నీటికి బదులుగా గోరు వెచ్చని నీటిని తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని వారు అంటున్నారు. గోరు వెచ్చని నీటిని తాగితే పలు వ్యాధుల నుంచి బయట పడవచ్చని, మనం అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటామని వారు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు గోరు వెచ్చని నీటినే తాగాలని వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజూ నిరంతరాయంగా గోరు వెచ్చని నీళ్లను తాగితే ఎన్ని లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం నిద్ర లేచిన వెంటనే సుమారుగా ఒక లీటర్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఒకేసారిగా తాగడం కష్టం అనుకుంటే నెమ్మదిగా ఒక గ్లాస్‌తో మొదలు పెట్టవచ్చు. క్రమంగా పరిమాణం పెంచుతూ పోవచ్చు. దీంతో రోజూ ఉదయాన్నే లీటర్ గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు అవుతుంది. ఇలా తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. పేగులు క్లీన్ అవుతాయి. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. మలబద్దకం ఉండదు. అలాగే గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో రోజంతా క్యాలరీలు ఖర్చవుతూనే ఉంటాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక అధిక బరువు తగ్గాలనే ప్లాన్ లో ఉన్న వారు రోజూ గోరు వెచ్చని నీటిని తాగితే ప్రయోజనం ఉంటుంది.
గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే ముక్కు దిబ్బడ తొలగిపోతుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరు వెచ్చని నీళ్లను తాగితే శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట వస్తుంది. దీంతో చెమట ద్వారా శరీరంలోని మలినాలు బయటకు పోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.
దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు నిరంతరాయంగా గోరు వెచ్చని నీళ్లను తాగుతుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా గొంతు, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన శ్లేష్మం కరిగిపోతుంది. దీంతో శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి కనక కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. అలాగే షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. ఇలా గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి రోజూ ఈ నీళ్లను తాగడం మరిచిపోకండి.