Cinnamon Water | మసాలా వంటకాలు అంటే మనకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. వెజ్ లేదా నాన్ వెజ్ వంటల్లో అనేక వెరైటీ వంటకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ మసాలా వంటకం అయినా సరే కచ్చితంగా పలు దినుసులను వేస్తుంటారు. వాటిల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీన్ని వేస్తే వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క ఆయుర్వేద పరంగా ఎన్నో అద్భుతమైన లాభాలను అందిస్తుంది. దీన్ని అనేక ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా దాల్చిన చెక్కను నీటిలో మరిగించి ఆ నీళ్లను తాగితే ఎన్నో రోగాల నుంచి బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క నీళ్లను రోజూ తాగితే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని వారు అంటున్నారు.
దాల్చిన చెక్క నీళ్లు డయాబెటిస్ ఉన్నవారికి వరం అనే చెప్పవచ్చు. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీని వల్ల కణాలు సురక్షితంగా ఉంటాయి. అలాగే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. శరీర రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల గుండెను సంరక్షిస్తాయి. గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చూస్తాయి. దాల్చిన చెక్క నీళ్లను తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) పెరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు.
దాల్చిన చెక్క నీళ్లను సేవిస్తే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు నయం అవుతాయి. ఈ నీళ్లను తాగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేసే విషయం. దీంతో నొప్పులను, వాపులను తగ్గించుకోవచ్చు. దాల్చిన చెక్క నీళ్లను తాగడం వల్ల క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ నీళ్లను సేవిస్తే ఐరన్ సమృద్ధిగా లభించి రక్త కణాలు తయారవుతాయి. దీంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది. దాల్చిన చెక్కలో ఉండే మాంగనీస్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆస్టియోపోరోసిస్ రాకుండా రక్షిస్తుంది.
స్త్రీలు నెలసరిస మయంలో ఈ నీళ్లను సేవిస్తుంటే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అధిక రక్తస్రావం తగ్గుతుంది. దాల్చిన చెక్క నీళ్లు పురుషులకు కూడా ఎంతగానో మేలు చేస్తాయి. ఈ నీళ్లలో కాస్త తేనె కలిపి తాగుతుంటే పురుషుల్లో నపుంసకత్వ సమస్య తగ్గుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. హార్మోన్ల సమస్యలు పోతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. ఇలా దాల్చిన చెక్కతో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొందరికి ఈ నీళ్లను సేవిస్తే జీర్ణాశయంలో అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఈ నీళ్లను తాగకపోవడమే మంచిది.