అనుకోకుండా మూత్రం వస్తున్న ఫీలింగ్, ఆపుకుందామన్నా ఆపలేమని భయం, ఉన్నపళంగా వాష్‌రూమ్‌కు వెళ్లలేని పరిస్థితి.. ఇలాంటి అనుభవం అందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది కదా. ఇలా జరగడం ఏదైనా వ్యాధికి సంకేతమని సందేహించడం సహజమే! అనుకోకుండా ఎందుకొస్తుందో అర్థం కాని ఈ సమస్యకు ఒత్తిడి, ఆందోళనకు సంబంధం ఉందట.
మూత్రాశయానికి, మెదడుకు సంబంధం ఉంటుందట. మీటింగ్‌లో నలుగురి ముందు మాట్లాడే వంతు వస్తుందనగానే ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఏమన్నా తప్పు మాట్లాడతామా? అనే సందేహాలు మెదడును తొలిచేస్తుంటాయి. ఇలా మెదడులో కలిగే మర్పుల వల్ల నాడీ సంకేతాల్లో వ్యత్యాసాలు ఏర్పడతాయి. అలాగే హార్మోన్లపైనా ఈ ఒత్తిడి ప్రభావం పడుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ సందర్భంలో మెదడు నుంచి మూత్రాశయానికి విసర్జనను ప్రేరేపించే సంకేతాలు అందుతాయి.
ఫలితంగా మూత్రం ఆపుకోవడం కష్టంగా మారుతుంది. అయితే ఈ సమస్యను మూత్రాశయ వ్యాధికి సంకేతంగా భావించొద్దు. మనోవ్యాధి కూడా కాదు. అప్పుడప్పుడూ సాధారణంగా జరిగేదేనని వైద్యులు చెబుతున్నారు. కంగారు, ఆందోళన లేకుండా జీవితం సాధ్యం కాదు. కాబట్టి నలుగురిలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ముందే మూత్ర విసర్జన చేయడం ద్వారా రిలాక్స్డ్గా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.