తస్మాత్ జాగ్రత్త! అన్ని విషయాల్లోనూ పెద్దలు చెప్పే మాట ఇది. ముందుచూపు ఉన్నవాడే ముందడుగు వేయగలడు. ఆర్థిక విషయాల్లోతప్పటడుగు వేస్తే.. రెండేండ్లకో, మూడేండ్లకో కోలుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈ సూత్రం చెల్లదు. ‘నాకేమవుతుంది!’ అన్న నిర్లిప్త ధోరణి మిమ్మల్ని రోగాల విష వలయంలోకి నెట్టేయొచ్చు. ఆరోగ్య బీమా ఉంటే.. చికిత్సకయ్యే ఖర్చులు మీదపడకుండా ఉంటాయి కానీ, మీ బీమా రోగం రాదన్న ధీమా ఇవ్వదు కదా!! మరెలాగంటారా?!
ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన జీవనశైలితో రాగల రోగాలను అడ్డుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి వ్యాధులనైనా నయం చేసే శక్తి ఆధునిక వైద్యరంగానికి ఉంది! కానీ, అదే సమయంలో వేగంగా పెరుగుతున్న రోగాలు వైద్యులకూ సవాళ్లు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు వైద్యులు. గతంతో పోలిస్తే.. ఈ మధ్య కాలంలో ఎలాంటి వ్యాధులు పెరుగుతున్నాయి, అందుకు కారణాలేంటి? మారుతున్న జీవనశైలి మనిషి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నది? తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం!
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్’ నానుడి ఆరోగ్యానికి సంబంధించినదే! సంపాదన వేటలో పరుగులు తీస్తున్న మనిషి ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీనికితోడు జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేక, అలవాట్లు మానుకోలేక, వ్యాయామం చేసే తీరిక లేక… ఇలా రకరకాల కారణాలతో రోగాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో నడి వయసులోనే దవాఖానల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముప్పయ్ ఏండ్లలోనే గుండె జబ్బులు పలకరిస్తున్నాయి. నలభై రాకముందే కిడ్నీలు మొరాయిస్తున్నాయి. డబ్బుల్లో రావాల్సిన నరాల సమస్యలు… యాభై రాకముందే ముంచుకొస్తున్నాయి. దీనికంతటికీ కారణంఆరోగ్యంపై శ్రద్ధ లేకపోవడమే!

ఒకప్పుడు యాభై ఏండ్లు దాటాక గానీ, గుండె సమస్యలు పలకరించేవి కావు. కానీ, ఇప్పుడు ముప్పయ్లోకి అడుగు పెట్టకముందే గుండె సంబంధిత రుగ్మతలు వస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది, 20-30 ఏళ్లలోపు వయసు వారు కూడా తీవ్రమైన గుండె జబ్బులకు గురవడం విచారకరం. అయితే చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులకు గురైనవారిలో ఎక్కువ శాతం రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ తరహా సమస్యల్లో చిక్కుకుంటున్న వాళ్లు కనీస ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకోకపోవడం గమనార్హం. తాజా అధ్యయనాల ప్రకారం గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో సుమారు 30 శాతం మంది 30 ఏళ్లలోపు వారే ఉంటున్నారట. వీరంతా అసహజమైన జీవనశైలి కారణంగానే ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. గణాంకాల ప్రకారం భారతదేశంలో 40 ఏళ్లలోపు వయసున్న ప్రతి నలుగురిలో ఒకరికి గుండెపోటును చూస్తున్నాం. సరైన జీవనశైలి, వ్యాయామం, నడక, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా గుండెకు వచ్చే జబ్బులను చాలా వరకు నియంత్రించవచ్చు.
న్యూరాలజిస్టుల నివేదికల ప్రకారం స్ట్రోక్ కేసులను పరిశీలిస్తే, దాదాపు మూడోవంతు యువతలోనే నమోదవుతున్నాయి. దీనికి అధిక రక్తపోటు, పొగ తాగడం, మద్యం సేవించడం, ఒకేచోట ఎక్కువ సేపు కూర్చుని ఉండే ఉద్యోగాలు చేయడం వల్ల న్యూరాలజీ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా.. ముందస్తుగా మేల్కొనాలి. దురలవాట్లకు చెక్ పెట్టాలి. వర్క్ ైస్టెల్‌ని
మీ ఆరోగ్యానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవాలి. ఆరోగ్యపరంగా ఏదైనా అసౌకర్యాన్ని గుర్తించిన వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి.

జీవనశైలి రుగ్మతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాస్త అలవాట్లు పక్కదారి పట్టినా.. మధుమేహం దాడి చేస్తున్నది. గతేడాది యువ ఉద్యోగులు, విద్యార్థుల్లో మధుమేహం, ఊబకాయ సమస్య అనూహ్యంగా పెరగడం కనిపించింది. ఎండోక్రైనాలజీ విభాగం గణాంకాల ప్రకారం, టైప్-2 మధుమేహం యువతలో వేగంగా పెరుగుతున్నది. సుమారు 40 శాతం మందికి తమకు డయాబెటిస్ ఉందన్న విషయమే తెలియకపోవడం గమనార్హం. అంతేకాదు, మధుమేహ బాధితుల్లో 50 శాతం మందిలో వ్యాధి అస్సలు నియంత్రణలో ఉండటం లేదట. దీనివల్ల మూత్రపిండాల సమస్యలు, గుండె వ్యాధులు, సంతానలేమి తదితర సమస్యలు చాపకింద నీరులా విస్తరిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. నెఫ్రాలజీ రికార్డుల ప్రకారం, డయాబెటిస్, హైపర్ టెన్షన్‌ను సమయానికి గుర్తించకపోవడం వల్ల యుక్త వయసులోనే తీవ్రమైన కిడ్నీ వ్యాధుల బారినపడుతున్నారు. వీటిని ప్రాథమిక దశలో గుర్తించి, తగిన చికిత్స తీసుకుంటే ప్రమాద తీవ్రత గణనీయంగా తగ్గుతుంది.

ఫ్యాటీ లివర్, కొలొరెక్టల్, పేగు సంబంధిత వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధిక క్యాలరీలతో కూడిన ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్స్, మద్యపానం, అస్థిర జీవనశైలి తదితర కారణాలతో ఈ సమస్యలు యువతలోనే ఎక్కువగా చూస్తున్నాం. మన దేశంలో నమోదవుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్ కేసుల్లో 30-40 శాతం మంది 50 ఏళ్లలోపు వారే ఉండటం ఆందోళన కలిగించే అంశం.
ఈ మధ్య కాలంలో బ్రెస్ట్, ఒవేరియన్, గ్యాస్ట్రో ఎంటెస్టినల్ వంటి క్యాన్సర్లు ఎక్కువగా యువతలోనే కనిపిస్తున్నాయి. వయసుతో సంబంధం లేని ఈ వ్యాధిపై జన్యు లక్షణాలు, జీవనశైలి, పర్యావరణ ప్రభావాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, గుండె, మెటబాలిక్, కాలేయం, మూత్రపిండాలు, న్యూరాలజీ, జీర్ణవ్యవస్థలకు సంబంధించిన నివారించగల దీర్ఘకాలిక వ్యాధుల్లో 10-15 శాతం పెరుగుదల కనిపిస్తుంది. వీటిలో చాలా వ్యాధులను ప్రారంభదశలో స్రీనింగ్, జీవనశైలి మార్పులు, సమయానికి వైద్య పరీక్షల ద్వారా నివారించగలిగినవే.

మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి కారణంగా కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. అందులో ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో పని చేసే యువత రోజుకు పది గంటలకు పైగా ఒకే చోట కూర్చుని పనిచేయడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఎక్కువగా జంక్ ఫుడ్, ప్రాసెసింగ్ ఫుడ్‌పై ఆధారపడటం వల్ల అనారోగ్య సమస్యల్లో చిక్కుకుంటున్నారు. దేశ జీడీపీ, అభివృద్ధికి వెన్నెముకగా ఉండాల్సిన యువత అనారోగ్యం పాలవ్వడం దేశ భవిష్యత్తుకే ముప్పుగా పరిణమిస్తున్నది. ఈ అంశాన్ని ప్రతిఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా గుర్తించాలి. జబ్బు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, జబ్బు రాకుండా చూసుకోవడం ప్రధానం అని గ్రహించాలి. జీవనశైలిలో మార్పుల ద్వారా వ్యాధులను వృద్ధాప్యం వరకు వాయిదా వేయవచ్చు.
కార్పొరేట్ ఎంప్లాయి మొదలుకొని, సాధారణ ఉద్యోగి వరకు ఆరోగ్య బీమాపై అవగాహన కలిగి ఉంటున్నారు. ఉద్యోగంలో చేరగానే.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తుందేమో కానీ, వ్యాధులను రాకుండా అడ్డుకోదు కదా! ఇక ఇన్సూరెన్స్ లేనివారి పరిస్థితి అగమ్య గోచరం. ఒక వ్యక్తి ఆస్పత్రి పాలైతే.. ఆ భారం కుటుంబం అంతా మోయాల్సి వస్తుంది. తీవ్రమైన వ్యాధులు తలెత్తితే.. ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇలా జరగొద్దంటే…ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తించాలి. అందుకు తగ్గ జీవనశైలిని పాటించాలి. వ్యాధులను ప్రారంభదశలోనే గుర్తించడం వల్ల.. పెను ముప్పును తప్పించుకోవచ్చు.
…?మహేశ్వర్‌రావు బండారి
– డా॥ గోపిచంద్ మన్నం సీనియర్ కన్సల్టెంట్, కార్డియోథొరాసిక్ సర్జరీ
విభాగాధిపతి మేనేజింగ్ డైరెక్టర్, స్టార్ హాస్పిటల్
– డా॥ రమేష్ గుడపాటి సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజి
జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ స్టార్ హాస్పిటల్ హైదరాబాద్