జీవన ప్రమాణం మనం నివసించే ప్రదేశంపై ఆధారపడి ఉంటుందని ఇప్పుడిప్పుడే మాట్లాడుకుంటున్నారు. నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కాలుష్యం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఆయుష్షు కూడా తగ్గుతుందని అందరి అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో నగరాలను వీడలేక, ఉండలేక సతమతమవుతున్న వాళ్లు ఆకాశహర్మ్యాల వైపు చూస్తున్నారు. పై అంతస్తుల్లో ఉంటే కాలుష్య ప్రభావం తక్కువగా ఉంటుందని వాళ్ల నమ్మకం. అయితే ఎత్తయిన ప్రదేశంలో ఉంటే లాభాలతోపాటు నష్టాలూ ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వల్ల పైకి పోతున్న కొద్దీ గాలిలో కాలుష్యం తక్కువ స్థాయిలో ఉంటుందనేది నిజమే! కానీ, ఆ కాలుష్యంతోపాటే ఆక్సిజన్ కూడా తగ్గుతూ ఉంటుంది. తక్కువ స్థాయిలో ఆక్సిజన్ ఉండటం వల్ల ఆస్తమా, ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు రక్తపోటులో మార్పులు కూడా వస్తాయట. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరు మారిపోతుంది. ఆకాశహర్మ్యాల్లోని ఎత్తయిన అంతస్తుల్లోకి మారినప్పుడు శరీరంలో కలిగే మార్పులు వెంటనే గుర్తించలేమని అంటున్నారు. ఈ ప్రభావం దీర్ఘకాలంలో ప్రతికూలంగా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. రోజంతా ఇంటి పరిసరాల మధ్య ఉంటూ, అదే గాలిని పీల్చడం మంచిది కాదు. ఆరుబయటి వాతావరణంలో ఉండే గాలిని కూడా పీల్చాలి. సాధారణంగా ఆకాశహర్యాల్లో ఉండే వృద్ధులు బయటికి రావడం అరుదే! దీనివల్ల వాళ్లకు కొత్త అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుందని వైద్యులు చెబుతున్నారు.