Snoring | గురక (Snoring) చాలా సాధారణమైన సమస్య. ఇది బాధితున్నే కాకుండా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెట్టే సమస్య. నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసివేసి నిద్రలేమికి కారణం అవుతుంది. గురక (Snoring)ను చాలామంది పట్టించుకోరు. చూసేందుకు సాధారణంగా కనిపించే సమస్యే అయినా.. పక్కనున్న వారిని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. దాంతో వారంతా నిద్రపోయేందుకు ఇబ్బందిపడుతుంటారు. కానీ, వాస్తవానికి గురక అనేది తీవ్రమైన వైద్య సమస్య.
ఇది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాకు సంకేతమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చాలా సందర్భాల్లో ఈ సమస్య అకాల మరణాలకు దారి తీస్తుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ప్రకారం.. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా హైబీపీ, గుండెజబ్బులు, స్ట్రోక్, టైప్-2 డయాబెటిస్, డిప్రెషన్‌తో పాటు ముందస్తు మరణాలకు దారి తీస్తుంది. WebMD ప్రకారం.. ఎవరైనా పగటిపూట అధికంగా నిద్రపోయినా.. తరుచుగా లేదంటే.. భారీగా గురకపెడుతున్నట్లుగా గుర్తిస్తే.. వైద్య సహాయం అవసరం. ఎందుకంటే ఈ దశ గురక మిమ్మల్ని ప్రాణాంతక వ్యాధుల ప్రమాదంలో పడేస్తుంది. గురకను నివారించేందుకు పలు చిట్కాలున్నాయి. వీటితో సమస్యను నివారించుకోవచ్చు. వెనుకకు తిరిగి పడుకోవడం వల్ల నాలుక, గొంతులోని ఇతర కణజాలాల ద్వారా వాయుమార్గం అడ్డుకుంటుంది.
కాబట్టి, పక్కకి తిరిగి పడుకోవడానికి ప్రయత్నించండి. ఇది శ్వాస ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఫలితంగా గురక తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు భారీ భోజనం తినడం.. మద్యం సేవించడం వల్ల గొంతు కండరాలు సడలించబడతాయి. ఇది కూడా గురకకు కారణమవుతుంది. కాబట్టి నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు భోజనం పూర్తి చేసుకోవడం మంచిది. ఇక మద్యానికి దూరంగా ఉండడం ఇంకా బెటర్. ఇక ధూమపానం గొంతు, శ్వాసనాళంలో వాపునకు కారణమవుతుంది. దాంతో గురకకు కారణమవుతుంది. అలాంటి పరిస్థితిలో.. ధూమపానం మానేయడం వల్ల గురక సమస్య తగ్గడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు కూడా గురక పెట్టే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో బరువు తగ్గడం వల్ల వాయుమార్గాలపై కొవ్వు ఒత్తిడి తగ్గుతుంది. శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది.