Health tips : ఈ మధ్యకాలంలో గుండెపోటు (Heart attack) మరణాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా, ఆడామగ తేడా లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. నిత్యం కసరత్తులు చేసి ఫిట్‌గా ఉండే క్రీడాకారులు (Players), ఎలాంటి గుండె జబ్బుల (Heart issues) ఆనవాళ్లు లేని ఆరోగ్యవంతులు కూడా అకస్మాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్‌లతో, కార్డియక్ అరెస్ట్‌ల (Cardiac arrests) తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఆకస్మిక గుండె రుగ్మతలకు చెక్‌పెట్టేందుకు కొన్ని ఆహార పదార్థాలు (Food items) ఉన్నాయని ఆరోగ్య నిపుణులు (Health experts) చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమమైన ఆహార పదార్థాలు చేపలు, గుడ్లు. ఈ రెండింటిలోనూ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు శాఖాహారులైతే చేపలు, గుడ్లకు బదులుగా డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో కూడా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నివారిస్తాయి. పప్పుధాన్యాలు, బీన్స్‌ను కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శరీరానికి పుష్కలంగా ప్రోటీన్‌ను అందించడంతోపాటు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతాయి.
అదేవిధంగా సిట్రస్ జాతి పండ్లలో కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక పోషకాలు ఉంటాయి. సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దాంతో ఆకస్మిక గుండెపోట్లు, కార్డియాక్ అరెస్ట్‌ల వంటివి జరగకుండా ఉంటాయి.