Barley Water | పూర్వకాలంలో బియ్యానికి ప్రత్యామ్నాయంగా వాడే ధాన్యాల్లో బార్లీ కూడా ఒకటి. మన పూర్వీకులు దీనిని కూడా ఆహారంగా తీసుకునే వారు. బార్లీతో వివిధ రకాల వంటలను వండి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో ఫైబర్ తో పాటు మన శరీరానికి అవసనరమయ్యే పోషకాలు ఎన్నో ఉన్నాయి. అయితే కేవలం బార్లీతో చేసిన వంటకాలే కాకుండా బార్లీ నీటిని తీసుకోవడం వల్ల కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా గ్రీక్, బ్రిటన్ వంటి దేశాల్లో కైకియాన్ అనే పానీయాన్ని బార్లీ నీటితోనే తయారు చేస్తారు. బ్రిటన్ లో ఎక్కువగా వేడిగా ఉండే బార్లీ నీటిని టీ లాగా తాగుతారు. అంతేకాకుండా బార్లీ నీటిలో నారింజ, నిమ్మరసం వంటివి కలిపి తీసుకుంటూ ఉంటారు. అలాగే బార్లీ నీటిని తాగడం వల్ల మూత్రాశయ ఇన్పెక్షన్ వంటివి కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
బార్లీ నీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్, ముఖ్యమైన ఖనిజ లవణాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. బార్లీ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బార్లీ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. శరీరం నుండి వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి. ఈ నీటిని తాగడం వల్ల శరీరం అంతర్గతంగా శుభ్రపడుతుంది. బార్లీ నీరు మూత్రవిసర్జనకారిగా పని చేస్తాయి. ఈ నీటిని తీసుకోవడం వల్ల మూత్రనాళాల ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి. అలాగే మూత్రనాళాల ఇన్పెక్షన్ లతో బాధపడే వారికి ఈ నీరు సహజ నివారిణిగా కూడా పని చేస్తాయి. పిల్లలు, పెద్దలు రోజూ బార్లీ నీటిని తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. చక్కటి జీర్ణవ్యవస్థకు కూడా బార్లీ నీరు దోహదపడతాయి.
ఈ నీటిని తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. వాంతులు, విరేచనాలతో బాధపడే వారు ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. ఈ నీటిని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. బార్లీ నీరు కడుపును నిండుగా ఉంచుతాయి. దీంతో అతిగా తినడం, తరుచుగా తినడం వంటివి జరగకుండా ఉంటాయి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. అంతేకాకుండా బార్లీ నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ కూడా అదుపులో ఉంటాయి. కనుక గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇలా అనేక రకాలుగా బార్లీ నీరు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఇక ఈ నీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. దీనిలో రుచి కోసం తేనె, నిమ్మరసం లేదా ఇతర పండ్ల రసాలను కూడా కలుపుకోవచ్చు. ఈ నీటిని తయారు చేసుకోవడానికి పొట్టు తీసిన బార్లీ లేదా పెర్ల్ బార్లీని ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఒక గిన్నెలో పావు కప్పు బార్లీని తీసుకోవాలి. తరువాత 4 కప్పుల నీరు పోసి మధ్య మధ్యలో కలుపుతూ అరగంట పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి అందులో రుచి కోసం నిమ్మరసం లేదా తేనె కలిపి గోరు వెచ్చగా తీసుకోవాలి. అలాగే రుచి కోసం అల్లం, నారింజ రసం, దాల్చిన చెక్క పొడి, జీలకర్ర పొడి వంటి వాటిని కూడా కలిపి తీసుకోవచ్చు. అలాగే నీటిని తయారు చేయగా మిగిలిన గింజలను సలాడ్స్, తృణధాన్యాలు వంటి వాటితో కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా బార్లీ నీరు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.