Neem Tree | మన చుట్టూ ఔషధ గుణాలు కలిగిన మొక్కలు అనేకం ఉంటాయి. వాటిలో వేప మొక్క కూడా ఒకటి. వేపలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వేప మొక్కను ఉపయోగించడం ద్వారా మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎంతో కాలంగో నోటి శుభ్రతకు మనం వేప పుల్లలను ఉపయోగిస్తూనే ఉన్నాం. అలాగే చక్కటి జీర్ణక్రియకు, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా మంది వేప ఆకులను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. పాతకాలం నాటి ఈ పద్దతులకు ఆధునిక పరిశోధనలు కూడా మద్దతును ఇస్తున్నాయి. వ్యాధులను నివారించడంలో, జన్యు నష్టాన్ని తగ్గించడంలో, యాంటీ ఆక్సిడెంట్ల కార్యకలాపాలను పెంచడానికి ఇలా అనేక రకాలుగా వేప చెట్టు మనకు సహాయపడుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
అలాగే మానవ వినియోగానికి ఏ రకమైన వేప సురక్షితమో అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని వారు చెబుతున్నారు. వేప ఆకులు లేదా వేప సారాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వారు తెలియజేస్తున్నారు. వేపను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వారు వివరిస్తున్నారు. వేప ఆకులు లేదా వేప సారాలు శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి స్టెఫిలోకాకస్ ఆరియస్, మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫిలోకాకస్ ఆరియస్ వంటి బ్యాక్టీరియాలను నిరోధించగలవు. వేప ఆకులను వాడడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్లు మన దరి చేరకుండా ఉంటాయని వైద్యులు తెలియజేస్తున్నారు. వేపలో వైరస్ ఇన్పెక్షన్ లతో పోరాడే సమ్మేళనాలు కూడా ఉంటాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మొత్తం శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు హెర్పెస్, పోలియో, హెచ్ఐవీ, డెంగీ వంటి వ్యాధులకు వ్యతిరేకంగా వేప బెరడు సారం పనిచేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అయితే వేప బెరడును నమిలే విషయంలో జాగ్రత్త వహించాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే వేప బెరడును నమలడం వల్ల పాచి తొలగిపోవడంతో పాటు చిగుళ్ల ఇన్పెక్షన్ లు కూడా తగ్గుతాయి. నోటి ఆరోగ్యం, దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేప బెరడును రోజూ ఉపయోగించవద్దు. వీటిని అతిగా ఉపయోగించడం వల్ల నోటిపూత వచ్చే అవకాశం ఉంది. కనుక పరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన వేప బెరడును మాత్రమే అవసరాన్ని బట్టి ఉపయోగించాలి. వేప ఆకులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీర్ఘకాలిక వాపు వల్ల కొన్ని రకాల క్యాన్సర్ లు సంభవిస్తాయి. వేప ఆకులను తీసుకోవడం వల్ల దీనిలో ఉండే శోథ నిరోధక లక్షణాలు వాపులను తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మొటిమలు, తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను తగ్గించడంలో వేప ఆకులు, వేప నూనె మనకు ఎంతో సహాయపడతాయి.
వేప నూనెను రాసుకోవడం వల్ల లేదా వేప ఆకులను పేస్ట్ గా చేసి చర్మానికి రాయడం వల్ల ఆయా చర్మ సమస్యలు తగ్గుతాయి. తగిన మోతాదుగా వేపను ఉపయోగించడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి. వేపను వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిస్ ను అదుపులో ఉంచడంలో వేప ఎంతగానో పని చేస్తుంది. నియంత్రిత, పర్యవేక్షించిన వేప వినియోగం పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించే పరాన్న జీవులను నశింపజేయడంలో వేప ఎంతో దోహదకరంగా ఉంటుంది. ఈ విధంగా వివిధ సాధారణ అనారోగ్య సమస్యలకు వేప చక్కటి మందుగా పని చేస్తుంది. దీనిని ఆహారంలో భాగంగా సులభంగా తీసుకోవచ్చు. కానీ ఏ రూపంలో ఏ పద్దతిలో ఎంత మోతాదులో తీసుకోవాలో తెలిసి ఉండడం కూడా చాలా ముఖ్యమని వేపను తీసుకునే ముందు వైద్యున్ని సంప్రదించడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.