Coffee | మనలో చాలా మంది తమ రోజును ఒక కప్పు కాఫీతో ప్రారంభిస్తూ ఉంటారు. ఉదయం కాఫీ తాగనిదే వారికి రోజు గడిచినట్టుగా కూడా ఉండదు. అలాగే ఏకాగ్రత పెరగడానికి, పని మధ్యలో కొంత విశ్రాంతి లభించడానికి కూడా కాఫీని తాగుతూ ఉంటారు. కాఫీ తాగడం వల్ల శరీరానికి ఉత్తేజం రావడంతో పాటు మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాఫీ తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధుల బారినుండి శరీరాన్ని కాపాడడంలో సహాయపడతాయి.
కాఫీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని, మనసును ఉత్తేజపరచడంలో దోహదపడుతుంది. కాఫీ తాగడం వల్ల ఏకాగ్రతతో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఇక కండరాలు బిగుసుకుపోకుండా చేయడంలో కూడా కాఫీ మనకు సహాయపడుతుంది. కాఫీ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. తలనొప్పి కూడా తగ్గుతుంది. అదే విధంగా వ్యాయామాలు ఎక్కువగా చేసేవారు, ఆటలు ఎక్కువగా ఆడేవారు కాఫీ తాగడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. కాఫీ తీసుకోవడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. అలసట తగ్గుతుంది. చేసే పనిపై దృష్టిని కేంద్రీకరించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు బ్లాక్ కాఫీని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరుగుతుంది. అంతేకాకుండా కాఫీని తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. కాఫీని తీసుకోవడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు భవిష్యత్తులో తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కాఫీ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 25 శాతం తక్కువగా ఉంటాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు.
ఇక కాఫీ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే కాఫీ తాగడం వల్ల మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. మనసు తేలికపడి ఆనందం కలుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ విధంగా కాఫీ తాగడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు. కాఫీ మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడే మనకు ఆ ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు. మితిమీరిన పరిమాణంలో కాఫీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బదులుగా అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.