Sleeplessness | ప్రస్తుతం అధిక శాతం మంది కూర్చుని చేసే ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు. చాలా మంది కూర్చునే ఎక్కువగా పనిచేస్తున్నారు. దీనికి తోడు నిత్యం అనేక సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల కారణంగా ఒత్తిడి బారిన పడుతున్నారు. దీంతో చాలా మందికి రాత్రి పూట నిద్ర సరిగ్గా పట్టడం లేదు. రాత్రి ఆలస్యంగా నిద్రిస్తున్నారు. ఉదయం కూడా ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి ఆలస్యంగా నిద్రిస్తే ఫర్వాలేదు. కానీ రోజూ ఆలస్యంగా నిద్రిస్తే మాత్రం శరీరంపై తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని వారు అంటున్నారు. ఆలస్యంగా నిద్రించడం వల్ల అనేక వ్యాధులు వస్తాయని, ప్రాణాల మీదకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని వారు చెబుతున్నారు.
రాత్రి పూట చాలా మందికి నిద్ర రావడం లేదు. దీంతో ఫోన్లను అదే పనిగా చూస్తున్నారు. ఇది కూడా ఆరోగ్యంపై తీవ్రమైన నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది. నిద్ర తక్కువైతే శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ఒత్తిడికి సంబంధించిన హార్మోన్. దీర్ఘకాలంలో ఇది శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. దీని వల్ల ఆందోళన పెరుగుతుంది. మానసిక ప్రశాంతత అనేది ఉండదు. శరీరంలో కార్టిసాల్ మరీ ఎక్కువైతే గుండెపై ప్రభావం పడుతుంది. ఇది హార్ట్ ఎటాక్‌ను కలిగిస్తుంది. ప్రస్తుతం చాలా మంది ఉన్న పళంగా కుప్పకూలి కార్డియాక్ అరెస్ట్‌తో ఇందుకే చనిపోతున్నారు.
మనం నిద్రించడం వల్ల మన శరీరం రీచార్జి అవుతుంది. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థ మరమ్మత్తులు చేసుకుంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కానీ నిద్ర తక్కువైతే రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీంతో ఇమ్యూనిటీ సైతం తగ్గిపోతుంది. ఫలితంగా వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే తెల్ల రక్త కణాలు తగ్గుతాయి. దీంతో తరచూ దగ్గు, జలుబు వంటి సమస్యల బారిన పడుతుంటారు. ఇలా జరుగుతుందంటే మీలో ఇమ్యూనిటీ తగ్గిందని అర్థం చేసుకోవాలి. ఇందుకు గాను మీరు నిద్ర సరిగ్గా పోతున్నారో లేదో చెక్ చేయాలి. ఇక సరిగ్గా నిద్రించకపోతే మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేసే తత్వాన్ని కోల్పోతుంది. దీంతో రోజువారి పనులు చేయడం కూడా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి నశిస్తాయి. దీంతో ఏ పనిపై ధ్యాస పెట్టలేకపోతుంటారు.
మనం సరిగ్గా నిద్రిస్తే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. కానీ నిద్ర లేకపోతే ఇవి రెండూ కోల్పోవాల్సి వస్తుంది. దీంతో మతిమరుపు అధికమవుతుంది. మీకు తరచూ మతిమరుపు సమస్య వస్తుందంటే మీరు సరిగ్గా నిద్రపోతున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నిద్ర లేకపోతే నిద్రపోయే ప్రయత్నం చేయండి. అలాగే నిద్రలేకపోతే హార్మోన్లపై కూడా ప్రభావం పడుతుంది. దీంతో స్త్రీ, పురుషుల్లో శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంది. సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లిపోతాయి. నిద్రించకపోతే మెటబాలిజం కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. థైరాయిడ్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. సరిగ్గా నిద్రలేని వారి చర్మం త్వరగా ముడతలు పడుతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయి. అందువల్ల నిద్ర మనకు చాలా ఆవశ్యకం అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మీరు గనక సరిగ్గా నిద్రపోకపోతే సైకియాట్రిస్ట్‌లను కలిసి చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.