White Tea | ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చాలా మంది గ్రీన్ టీ, బ్లాక్ టీ, పెప్పర్మింట్ టీ వంటి అనేక రకాల టీలను తాగుతుంటారు. అయితే చాలా మందికి వైట్ టీ కూడా ఉంటుందనే విషయం తెలియదు. ఇతర హెర్బల్ టీల మాదిరిగానే వైట్ టీ కూడా మనకు మార్కెట్లో లభిస్తుంది. దీన్ని కూడా ఆకుల నుంచే తయారు చేస్తారు. కమేలియా సైనెన్సిస్ అనే మొక్క ఆకుల నుంచి వైట్ టీని తయారు చేస్తారు. అయితే సాధారణ తేయాకులను పూర్తిగా ఆక్సీకరణ చెందిస్తారు. కనుకనే అవి నలుపు రంగులోకి మారుతాయి. ఇక గ్రీన్ టీ ఆకులను ఉడికిస్తారు. కానీ. వైట్టీ ఆకులను మాత్రం ఎండబెడతారు. అందువల్ల ఇవి పూర్తిగా సహజసిద్ధమైనవని చెప్పవచ్చు. సాధారణ టీ, గ్రీన్ టీ ఆకుల కన్నా వైట్ టీ ఆకులు అత్యంత సహజసిద్ధమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. కనుక వైట్ టీ మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని రోజూ తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు.
వైట్ టీని రోజూ సేవించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కాటెకిన్స్ అని పిలవబడే పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. వైట్ టీని తాగడం వల్ల అత్యధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్లను పొందవచ్చు. ఇవి మన శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ టీని సేవించడం వల్ల పాలిఫినాల్స్ అధిక మొత్తంలో లభించి రక్త నాళాలను ప్రశాంతంగా మారుస్తాయి. దీని వల్ల రక్త నాళాల వాపులు తగ్గి రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ టీ ఎంతో మేలు చేస్తుంది. ఈ టీని సేవించడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు సైతం తగ్గుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
వైట్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మానికి సాగే గుణాన్ని అందిస్తుంది. చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. కనుక వైట్ టీని రోజూ తాగుతుంటే ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండవచ్చు. వైట్ టీని తాగడం వల్ల సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల బారి నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది. ఈ టీని సేవిస్తుంటే ఈజీసీజీ అనే సమ్మేళనం సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీర మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. దీని వల్ల క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కనుక బరువు తగ్గాలని చూస్తున్నవారు రోజూ ఈ టీని తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది.
వైట్ టీని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. కనుక ఇది సహజసిద్ధమైన యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుంది. దీంతో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు. రోగాలు తగ్గుతాయి. జ్వరం వచ్చిన వారు ఈ టీని సేవిస్తుంటే త్వరగా కోలుకుంటారు. ఇలా వైట్ టీని తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే ఈ టీని రోజుకు 1 లేదా 2 కప్పులకు మించి తాగకూడదు. ఇక వైట్ టీ ఆకులను అతిగా మరిగించకూడదు. లేదంటే అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. ఈ విధంగా వైట్ టీని రోజూ తాగి అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.