Fruit Combinations | మనకు సీజనల్‌గా అందుబాటులో ఉండే పండ్లతోపాటు ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండ్లను కూడా తరచూ తింటుండాలి. పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనకు పోషణను, శక్తిని అందిస్తాయి. రోగాల నుంచి రక్షిస్తాయి. అయితే చాలా మంది పండ్లను తినేకన్నా జ్యూస్ తాగడమే బెటర్ అని అనుకుంటారు. జ్యూస్‌ను తయారు చేసుకుని తాగుతుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ కొందరు కొన్ని రకాల పండ్లను మిక్స్ చేసి జ్యూస్ తయారు చేసి తాగుతుంటారు. అయితే కొన్ని రకాల పండ్లను ఎట్టి పరిస్థితిలోనూ కలిపి తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. పలు రకాల పండ్లను కలిపి తినడం వల్ల లేదా జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. కనుక ఏయే పండ్లను కలిపి తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండ్లు, నారింజ పండ్లను కలిపి తినరాదు. అలాగే వీటి జ్యూస్‌ను కూడా కలిపి తీసుకోరాదు. అలా చేస్తే పొట్టలో ఆమ్లత్వం పెరుగుతుంది. దీంతో కడుపు ఉబ్బరం వస్తుంది. పొట్టంతా గ్యాస్‌తో నిండిపోయి అసౌకర్యంగా ఉంటుంది. అలాగే సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారికి పొట్టలో తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. కనుక ఈ రెండు పండ్లను కలిపి తీసుకోకూడదు. అలాగే యాపిల్ పండ్లను నారింజ పండ్లతో కలిపి తినకూడదు. ఈ రెండింటినీ కలిపి జ్యూస్ చేసి కూడా తాగకూడదు. అలా తాగితే జీర్ణ వ్యవస్థ కన్ఫ్యూజన్కు గురవుతుంది. దీంతో అజీర్తి ఏర్పడుతుంది. గ్యాస్, త్రేన్పులు వస్తుంటాయి. దీంతోపాటు మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను కూడా మన శరీరం సరిగ్గా శోషించుకోలేదు. కనుక ఈ రెండు పండ్ల కాంబినేషన్ కూడా మంచిది కాదు. వీటిని కూడా కలిపి తీసుకోకూడదు.
పుచ్చకాయలను, అరటి పండ్లను కూడా ఒకేసారి తీసుకోకూడదు. పుచ్చకాయల్లో నీటి శాతం ఎక్కువ. అరటి పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణాశయంలో గ్యాస్ ఏర్పడి కడుపు ఉబ్బరం వస్తుంది. పొట్టంతా అసౌకర్యంగా ఉంటుంది. వీటిల్లో ఉండే పోషకాలు కూడా మనకు సరిగ్గా లభించవు. కనుక ఈ రెండు పండ్లను కూడా కలిపి తీసుకోకూడదు. అలాగే రెండింటి కాంబినేషన్లో తయారు చేసిన జ్యూస్‌ను కూడా తాగకూడదు. ఇక పైనాపిల్, మామిడి పండ్లను కలిపి తీసుకోకూడదు. పైనాపిల్ పండ్లలో బ్రొమెలెయిన్ ఉంటుంది. ఇది మామిడి పండ్లలోని పోషకాలతో చర్య పొందుతుంది. దీంతో పొట్టలో కిణ్వన ప్రక్రియ జరుగుతుంది. పొట్టలోని ఆహారం పులుస్తుంది. దీని వల్ల పుల్లటి త్రేన్పులు వస్తాయి. పొట్టలో గ్యాస్ ఏర్పడి అసౌకర్యంగా ఉంటుంది. కనుక ఈ రెండింటి కాంబినేషన్ కూడా పనికిరాదు.
జామ పండ్లను, అరటి పండ్లను కూడా కలిపి తినకూడదు. రెండింటి జ్యూస్‌ను కూడా కలిపి తాగకూడదు. జామ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అరటి పండ్లలోనూ ఇది ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే జీర్ణాశయంపై భారం పడుతుంది. దీంతో పొట్టలో నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా కలిపి తినకూడదు. అలాగే బొప్పాయి పండు, నిమ్మరసం కాంబినేషన్ కూడా పనికిరాదు. ఈ కాంబినేషన్ జీర్ణవ్యవస్థలో గ్యాస్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి వీటిని కూడా కలిపి తీసుకోకూడదు. ఇలా పలు రకాల పండ్లకు చెందిన కాంబినేషన్లను తీసుకోకుండా ఉంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.