Fennel Seeds | భోజనం చేసిన అనంతరం కొందరికి సోంపు గింజలను తినే అలవాటు ఉంటుంది. హోటల్స్ లేదా రెస్టారెంట్లలో ఆహారం తిన్నప్పుడు కచ్చితంగా సోంపు గింజలను ఇస్తారు. వాటిని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే భోజనం చేసిన తరువాత సోంపు గింజలను తినడం వల్ల నోటి దుర్వాసన రాకుండా అడ్డుకోవడమే కాక ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అందుకనే చాలా మంది భోజనం చేసిన తరువాత ఈ గింజలను తింటుంటారు. అయితే వాస్తవానికి సోంపు గింజలు కేవలం ఇవే కాదు, ఇంకా మనకు అనేక లాభాలను అందిస్తాయి. అయితే ఇందుకు గాను సోంపు గింజలను రోజూ తినాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన అనంతరం ఒక టీస్పూన్ మోతాదులో సోంపు గింజలను తింటుండాలి. దీని వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయం చేస్తాయి.
సోంపు గింజలను తినడం వల్ల కేవలం ఆహారం సులభంగా జీర్ణమై అజీర్తి తగ్గడమే కాదు, ఇతర జీర్ణ సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. ఈ గింజల్లో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. కనుక వీటిని తింటుంటే జీర్ణాశయంలోని కండరాలు ప్రశాంతంగా మారుతాయి. దీంతో పొట్టలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ఎప్పటికప్పుడు బయటకు వెళ్తుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. సోంపు గింజలను తినడం వల్ల జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. ఎంజైమ్‌ల పనితీరు మెరుగు పడుతుంది. దీని వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అజీర్తి ఉండదు. అలాగే ఆహారంలో ఉండే పోషకాలను సైతం శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఇక ఈ గింజలను రోజూ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఈ గింజల్లో సహజసిద్ధమైన యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. కనుక వీటిని రోజూ తింటుంటే జీర్ణాశయం, పేగుల్లో ఉండే కండరాలు బలపడతాయి. దీంతో కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనే సమస్య తగ్గిపోతుంది.
సోంపు గింజలను తినడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. సోంపు గింజల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ గింజలను తింటుంటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమ స్థాయిలో ఉంటాయి. దీని వల్ల ద్రవాలు సమతుల్యం అవుతాయి. సోడియం స్థాయిలు తగ్గుతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ గింజల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సోంపు గింజలను తినడం వల్ల పాలిఫినాల్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను సమృద్ధిగా పొందవచ్చు. ఇవి కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులను తగ్గిస్తాయి. దీని వల్ల ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
ఈ గింజల్లో విటమిన్ సి కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. విటమిన్ సి వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని సంరక్షించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చర్మం పొడిబారకుండా మృదువుగా మారి తేమగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. సోంపు గింజల్లో ఐరన్ అధిక మొత్తంలో లభిస్తుంది. అలాగే కాపర్‌ను కూడా పొందవచ్చు. ఇవి రెండూ ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీని వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. నీరసం, అలసట తగ్గుతాయి. ఇలా సోంపు గింజలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే రోజూ కచ్చితంగా ఈ గింజలను తినాల్సి ఉంటుంది.