Ash Gourd | గుమ్మడికాయల్లో మనకు రెండు రకాల కాయలు అందుబాటులో ఉంటాయన్న విషయం విదితమే. సాధారణ గుమ్మడికాయలను అందరూ తింటారు. కానీ బూడిద గుమ్మడికాయలను మాత్రం కేవలం దిష్టి తీయడానికి లేదా గుమ్మం వద్ద దిష్టి తగలకుండా కట్టేందుకు మాత్రమే ఉపయోగిస్తారు. వాస్తవానికి బూడిద గుమ్మడికాయ కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. బూడిద గుమ్మడికాయతో జ్యూస్ తయారు చేసి రోజూ తాగితే అనేక లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు. అలాగే దీంతో వంటకాలను కూడా చేసి తినవచ్చు. 100 గ్రాముల బూడిద గుమ్మడికాయను తింటే అందులో 96 శాతం నీరే ఉంటుంది. 17 క్యాలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. 4 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 1 గ్రాము ప్రోటీన్లు ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్లు సి, బి1, బి2, బి3, బి5, బి6లతోపాటు క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, జింక్, మాంగనీస్ అధికంగా ఉంటాయి.
బూడిద గుమ్మడికాయల్లో 96 శాతం మేర నీరే ఉంటుంది కనుక ఈ కాయలను తిన్నా లేదా జ్యూస్‌ను తాగినా శరీరానికి చల్లదనం లభిస్తుంది. శరీరంలో ఉండే వేడి పోతుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉంటాయి. దీంతో శరీరం యాక్టివ్‌గా, చురుగ్గా ఉంటుంది. బూడిద గుమ్మడికాయలతో మనకు చాలా తక్కువ క్యాలరీలు లభిస్తాయి. పైగా ఫైబర్ ఉంటుంది కనుక దీన్ని తిన్నా లేదా జ్యూస్‌ను తాగినా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు బూడిద గుమ్మడికాయను తింటుండాలి. దీంతో బరువును తగ్గించుకోవచ్చు. బరువు నియంత్రణలో ఉంటుంది.
బూడిద గుమ్మడికాయల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ఈ కాయలను తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఈ కాయలు సహజసిద్ధమైన ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల శరీరం లేదా జీర్ణాశయంలో అధికంగా ఉండే ఆమ్లాలను బయటకు పంపుతాయి. బూడిద గుమ్మడికాయలు ప్రీ బయోటిక్ ఆహారంగా పనిచేస్తాయి. ఈ కాయలను తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది. ఈ కాయలను తింటే అనేక రకాల బి విటమిన్లు లభిస్తాయి. ఇవి మన శరీరానికి శక్తి నిరంతరం అందేలా చూస్తాయి. దీంతో శరీరం చురుగ్గా ఉంటుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. యాక్టివ్‌గా ఉంటారు. తీవ్రమైన అలసట, నీరసం సైతం తగ్గిపోతాయి.
బూడిద గుమ్మడికాయ మెదడుపై రిలాక్స్ ఫీలింగ్ ను కలగజేస్తుంది. అందువల్ల ఈ కాయలను తింటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఈ కాయలను తింటే శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్, కిడ్నీలు డిటాక్స్ అవుతాయి. ఆయా భాగాల్లో ఉండే వ్యర్థాలను శరీరం సులభంగా బయటకు పంపుతుంది. దీంతో రోగాలు రాకుండా ఉంటాయి. ఇలా బూడిద గుమ్మడికాయలతో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఈ కాయలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.