Avocado | ప్రకృతి మనకు అందించిన అనేక రకాల పండ్లలో అవకాడో కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక చాలా మంది దీని వైపు కూడా చూడరు. అయితే ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం కచ్చితంగా ఈ పండును తినకుండా ఉండలేరు. ఎన్నో పోషకాలు ఈ పండ్లలో ఉంటాయి. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు అవకాడో పండ్లలో ఉంటాయి. 100 గ్రాముల అవకాడోలను తింటే సుమారుగా 160 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు 15 గ్రాములు, పిండి పదార్థాలు 8 గ్రాములు, ప్రోటీన్లు 2 గ్రాములు, ఫైబర్ 7 గ్రాములు ఉంటాయి. విటమిన్లు కె, బి9, సి, బి6, ఇ, బి5, బి2, బి3లతోపాటు పొటాషియం, కాపర్, మెగ్నిషియం, మాంగనీస్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ కూడా ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని పోషకాలకు నెలవుగా చెప్పవచ్చు. ఈ పండ్లను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
అవకాడోలలో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను, ట్రై గ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. ఈ పండ్లలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరిచి బీపీని నియంత్రణలో ఉంచుతుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె పోటు రాకుండా రక్షిస్తాయి. రక్త నాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. అవకాడో పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు రోజూ అవకాడో పండ్లను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ పండ్లు ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తాయి. అందువల్ల వీటిని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
అవకాడో పండ్లను తినడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా లభించి కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. అధిక బరువు ఉన్నవారు అవకాడో పండ్లను తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. బరువును తగ్గించుకుని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ పండ్లను తింటే లుటీన్, జియాజాంతిన్ అనే పోషకాలు లభిస్తాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. వృద్ధాప్యం కారణంగా కళ్లలో వచ్చే శుక్లాలు రాకుండా చూస్తాయి.
అవకాడోలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా మనం తిన్న ఆహారంలో ఉండే విటమిన్లను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ముఖ్యంగా విటమిన్లు ఎ, డి, ఇ, కెలను శరీరం సరిగ్గా గ్రహిస్తుంది. విటమిన్ ఎ వల్ల కంటి చూపు మెరుగు పడడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ డి వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ ఇ వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. పురుషుల్లో నపుంసకత్వ సమస్య తగ్గుతుంది. ఇక విటమిన్ కె వల్ల ఎముకలు బలంగా మారడంతోపాటు గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా అడ్డుకోవచ్చు. ఇలా అవకాడో పండ్లు మనకు ఎన్నో లాభాలను అందిస్తాయి.