Jogging | మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వేళకు భోజనం చేయడంతోపాటు పౌష్టికాహారాన్ని కూడా తీసుకోవాలి. అలాగే మితంగా భోజనం చేయాలి. రాత్రి పూట తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తినాలి. మన ఆరోగ్యం విషయంలో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే రోజూ వ్యాయామం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. వ్యాయామం వల్ల బరువు కూడా తగ్గుతారు. అయితే ప్రస్తుతం చాలా మంది నిత్యం కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేస్తున్నారు. దీని వల్ల వ్యాయామం ఉండడం లేదు. శారీరక శ్రమ చేయడం లేదు. కానీ శారీరక శ్రమ కచ్చితంగా ఉండాలి. ఎక్కువ ఏళ్ల పాటు ఎలాంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా జీవించాలంటే వ్యాయామం కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రోజూ కనీసం 15 నిమిషాల పాటు జాగింగ్ చేసినా ఎన్నో లాభాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వ్యాయామం చేసేందుకు సమయం లేదని భావించే వారు రోజుకు కనీసం 15 నిమిషాల పాటు జాగింగ్ చేయవచ్చు. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. 15 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే శరీరం సుమారుగా 100 క్యాలరీలను ఖర్చు చేస్తుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. జాగింగ్ వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే బరువు కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా జాగింగ్ను చేయడం వల్ల మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. ఇది మూడ్ను మారుస్తుంది. ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది.
రోజూ జాగింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో మైండ్ రిలాక్స్ అయి నిద్ర చక్కగా పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. జాగింగ్ చేయడం వల్ల ఎముకలు బలంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు విరిగే అవకాశాలు తగ్గుతాయి. అలాగే తొడ కండరాలు కూడా ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి. డయాబెటిస్ ఉన్నవారు రోజూ వ్యాయామం చేస్తే మంచిది. ముఖ్యంగా జాగింగ్ చేయడం వల్ల ఇన్సులిన్ ను శరరీం మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
రోజూ జాగింగ్ చేయడం వల్ల వెన్నెముక ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్యంలో వెన్ను లేదా డిస్క్ నొప్పి రాకుండా ఉంటాయి. జాగింగ్ చేస్తే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. దీంతో రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. జాగింగ్ చేయడం వల్ల మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. చురుగ్గా మారుతారు. ఉత్సాహంగా ఉంటారు. బద్దకం పోతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్నారుల్లో అయితే తెలివితేటలు పెరుగుతాయి. ఇలా రోజూ కనీసం 15 నిమిషాల పాటు అయినా సరే జాగింగ్ చేస్తే అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.