Dinner Ideas For Weight Loss | అధికంగా బరువు ఉన్నవారు రాత్రి పూట భోజనాన్ని త్వరగా ముగిస్తుంటారు. రాత్రి పూట తినే ఆహారంలో చపాతీలను చేర్చుకుంటారు. అంతే కాదు రాత్రి పూట ఆహారాన్ని తక్కువగా తింటారు. ఇలా బరువు తగ్గాలనుకునే వారు రాత్రి భోజనం పట్ల అనేక జాగ్రత్తలను పాటిస్తుంటారు. అయితే బరువు తగ్గాలంటే పలు ఆహారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. సరైన పోషకాలు ఉండే ఆహారాలను తింటే బరువు తగ్గడం తేలికవుతుంది. ఈ క్రమంలోనే రాత్రి పూట కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి కనుక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అధిక బరువు తగ్గాలనుకునే ప్రణాళికలో ఉన్న వారు రాత్రి పూట ఈ ఆహారాలను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది.
రాత్రి పూట ఆహారంలో స్కిన్ లెస్ చికెన్ తినవచ్చు. ఇది అద్భుతమైన ప్రోటీన్లను అందిస్తుంది. అలాగే రాత్రి పూట ఆహారంలో చేపలను తింటున్నా మేలు జరుగుతుంది. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. సోయా టోఫులో వృక్ష సంబంధ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంతోపాటు బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి. పప్పు దినుసులు, శనగలను తింటున్నా కూడా ఫలితం ఉంటుంది. వీటిల్లో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయి. పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉండే కూరగాయలను రాత్రి పూట తినాల్సి ఉంటుంది. పాలకూర, బ్రోకలీ, కాలిఫ్లవర్, మొలకలు, క్యాప్సికం, పుట్ట గొడుగులు, గ్రీన్ బీన్స్ వంటి ఆహారాలను రాత్రి పూట తింటుంటే మేలు జరుగుతుంది.
సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉండే ఆహారాలను తింటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. కినోవా, బ్రౌన్ రైస్, చిలగడదుంపలు వంటి వాటిల్లో సంక్లిమైన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్‌గా మారేందుకు సమయం పడుతుంది. పైగా వీటిని కాస్త తిన్నా చాలు, వీటిల్లో ఉండే ఫైబర్ కారణంగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇలా ఇవి బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వలు ఉండే ఆహారాలను కూడా రాత్రి పూట తినవచ్చు. అవకాడో, బాదంపప్పు, వాల్ నట్స్, చియా సీడ్స్‌ను రాత్రి పూట తినవచ్చు. అలాగే ఆలివ్ ఆయిల్‌ను కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ రాత్రి పూట తీసుకోదగిన ఆహారాలు. అలాగే బరువు తగ్గేందుకు కూడా ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి.
రాత్రిపూట ఆహారంలో చేపలను, కూరగాయలను కలిపి కాంబినేషన్లో తినవచ్చు. లేదా చికెన్, వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ వంటి వాటిని కలిపి తీసుకోవచ్చు. బ్రౌన్ రైస్, వెజిటబుల్ సూప్‌ను కలిపి తీసుకోవచ్చు. సోయా టోఫు, కూరగాయలను కలిపి కూడా తినవచ్చు. ఇలా రాత్రి పూట భోజనాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఆరోగ్యకరమైన ఆహారాలను తిన్నప్పటికీ వీటిని రాత్రి పూట తక్కువ మోతాదులోనే తినాలి. ఇతర ఆహారాలతో పోలిస్తే ఇవి బరువు తగ్గేందుకు మనకు ఎంతో ఉపయోగపడతాయి. కానీ ఎక్కువ మోతాదులో మాత్రం తినకూడదు. ఇక రాత్రి పూట భోజనాన్ని వీలైనంత త్వరగా తినేయాల్సి ఉంటుంది. భోజనానికి, నిద్రకు మధ్య కనీసం 2 నుంచి 3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. చక్కెర ఉండే ఆహారాలు, ప్రాసెస్ ఫుడ్స్, శీతల పానీయాలను తాగకూడదు. ఇలా ఆహారపు అలవాట్లను పాటిస్తుంటే అధిక బరువును చాలా తేలిగ్గా తగ్గించుకోవచ్చు.