న్యూఢిల్లీ : కంటినిండా కునుకు తీయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర పలు అనారోగ్యాలను నివారించి వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. రోజుకు కనీసం ఏడెనిమిది గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నిద్రావస్ధలో మన శరీర అవయవాలు మరమ్మత్తులకు లోనై తదుపరి రోజు చక్కబెట్టాల్సిన కార్యకలాపాలకు సిద్ధమవుతాయి.
అయితే రాత్రి పొద్దుపోయిన తర్వాత డిన్నర్ చేయడం, ఎక్కువగా తినడం, ఒత్తిడి, యాంగ్జయిటీ వంటి పలు కారణాలతో కొందరిని నిద్ర లేమి వెంటాడుతుంది. రాత్రి సమయంలో జంక్ ఫుడ్ తీసుకుంటే అజీర్ణానికి దారితీసి నిద్ర పట్టదని గ్లోబల్ రెయిన్బో హెల్త్‌కేర్, ఆగ్రాకు చెందిన డైటీషియన్ రేణుకా దంగ్ చెబుతున్నారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కెఫిన్‌ను ఏ రూపంలో కూడా తీసుకోకూడదని సూచిస్తున్నారు.
రాత్రి సమయంలో కంటి నిండా నిద్రించేందుకు కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవాలని చెబుతున్నారు. గోరు వెచ్చని పాలను తీసుకోవాలని ఇందులో ఉండే అమినో ఆమ్లాలు నిద్ర, మూడ్‌ను మెరుగుపరుస్తాయని చెప్పారు. గోరువెచ్చని పాలల్లో ఉండే ట్రిప్టోపన్ సెరటోనిన్, మెలటోనిన్ల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది.
డిన్నర్ తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే జీర్ణక్రియ సాపీగా సాగడంతో పాటు బాగా నిద్రపడుతుంది. నిద్రకు ఉపక్రమించే ముందు సాయంత్రం స్నాక్స్ సమయంలో జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌ను కొద్దిగా తీసుకోవాలని డాక్టర్ రేణుకా చెబుతున్నారు. ఇక అల్లం, తులసిని కలిపి మరిగించిన నీటిని సేవిస్తే తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణమై సుఖ నిద్ర సొంతమవుతుందని పేర్కొన్నారు.