Thyroid and Body weight | థైరాయిడ్ గ్రంధి.. దీన్నే అవటు గ్రంధి అని కూడా పిలుస్తారు. శరీరంలోని అతి ముఖ్యమైన గ్రంధుల్లో థైరాయిడ్ ఒకటి. మెడ మధ్య భాగంలో గొంతు ముందువైపు ఉంటుంది. ఇది శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంధి పనితీరు తప్పడం వల్ల హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజంతోపాటు ఆర్థైరటిస్ సమస్యలు వచ్చి పడతాయి. థైరాయిడ్ అసమతుల్యత కారణంగా శరీరం బరువు పెరగడం, జుట్టు రాలడం, కళ్ల కింద నల్లటి చారలు ఏర్పడటం, గొంతుపైన వాపు, గ్యాస్ట్రిస్ సమస్యలు, మలబ్ధకం వంటివి ఇబ్బందిపెడుతుంటాయి.
థైరాయిడ్ అనేది ట్రైయోడోథైరోనిన్ (టీ3), థైరాక్సిన్ (టీ4), కాల్సిటోనిన్లను స్రవిస్తుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరులో మార్పు రాగానే మన శరీరం బరువు ఒకేసారి పెరిగిపోతుంది. థైరాయిడ్ పేషెంట్లకు బరువు తగ్గేందుకు పోషకాహార నిపుణులు పలు ఆహారాలను సూచిస్తున్నారు. ఈ ఆహారాలను నిత్యం భోజనం ప్లేట్లో ఉండేలా చూసుకోవడం ద్వారా అతిగా పెరిగే శరీరం బరువును తగ్గించుకునేందుకు వీలుంటుందని వారు సెలవిస్తున్నారు.
జీవక్రియ వ్యవస్థ శరీరం బరువుతో పాటు కొన్ని శారీరక విధులను నిర్వహించే కీలకమైన భాగం. జీవక్రియ సక్రమంగా జరిగితే మనం చురుకుగా క్యాలరీలను బర్న్ చేయడం ద్వారా బరువును సమర్థంగా నిర్వహించుకోవచ్చు. థైరాయిడ్ పనిచేయకపోవడం వలన శరీరం బరువును ప్రభావితం చేసే జీవక్రియను బలహీనపరుస్తుంది. ఫలితంగా ఈ సమస్యను ఎదుర్కొనే వారు తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరుగుతారు. వీరు బరువు కోల్పోవడం చాలా కష్టమైన పని. దీర్ఘకాలంలో ఇది ఊబకాయం, కొలెస్ట్రాల్, హైపర్‌టెన్షన్, మధుమేహం వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగించే అవకాశాలున్నాయి. సరైన ఆహారాలను తీసుకోవడం ద్వారా థైరాయిడ్ సక్రమంగా పనిచేసేలా చేయవచ్చు.
థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో జీవక్రియ బలహీనత వెనకున్న కారణాల్లో అయోడిన్ లోపం ఒకటి. అండర్ యాక్టివ్ థైరాయిడ్ లేదా హైపోథైరాయిడిజం రోగులు బరువు తగ్గడానికి వారు తీసుకునే ఆహారంలో అయోడిన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అయోడిన్ మినరల్ టీఎస్‌హెచ్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపించి సమర్థవంతమైన బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఉప్పు, కోడిగుడ్లు, డెయిరీ ఉత్పత్తులు, కాడ్ ఫిష్, ఇండియన్ మాకరెల్తోపాటు సముద్ర ఆహారాల్లో అయోడిన్ లభిస్తుంది.
జీర్ణక్రియ, జీవక్రియ ఆరోగ్యానికి ఫైబర్ అత్యంత ముఖ్యమైనది. నిత్యం ఎక్కువ కరిగే ఫైబర్ కలిగి ఉండే ఆహారాలను తీసుకోవడం వలన శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచి శరీరం బరువు పెరగకుండా సహాయపడుతుంది. తృణధాన్యాలు, చిక్పీస్, కాయధాన్యాలు, బీన్స్, ఆపిల్స్ బెర్రీలు, కాలిఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలి, బ్రస్సెల్స్ మొలకలను ఎక్కువగా తింటూ ఉండాలి.
థైరాయిడ్ రోగులలో బరువు తగ్గడాన్ని ప్రారంభించే మరొక మినరల్ సెలీనియం. శరీరం నుంచి ఇది ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేగంగా క్యాలరీలను బర్న్ చేస్తుంది.
బాదం, గుడ్లు, చిక్కుళ్ళు, షెల్ఫిష్, రెడ్ మీట్, చికెన్, గుడ్లలో
సెలీనియం అధికంగా లభిస్తుంది.
శరీరం బరువు తగ్గాలని కోరుకునే వారందరూ చక్కెర, పిండి పదార్ధాలను చాలా దూరంలో పెట్టాలి. థైరాయిడ్ రోగులు ముఖ్యంగా బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడానికి కూడా ఈ రెండింటిని ఆహారంలో పరిమితం చేసుకోవాలి. ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. తక్కువ కార్బ్, అధిక ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవడంపై దృష్టిసారించి గణనీయమైన ఫలితాలను పొందవచ్చు.
మన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైనదే. ఫలితాలను పొందకపోతే భోజనం చేసే సమయాల్లో మార్పులు చేయండి. థైరాయిడ్ రోగులు అడపాదడపా ఉపవాసం చేయడం చాలా ఉత్తమం. ఇది తినే అవకాశాలను తగ్గించి మరింత కొవ్వును బర్న్ చేయడానికి సహకరిస్తుంది. ఉపవాసాలు చేయడం కష్టంగా ఉన్నవారు రోజువారీ భోజనం సంఖ్యను పరిమితం చేసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.