Diet To Reduce Cholesterol | ప్రస్తుత తరుణంలో కొలెస్ట్రాల్ చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎవరి శరీరంలో అయినా సరే కొలెస్ట్రాల్ పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ముఖ్య కారణం అస్తవ్యస్తమైన జీవన విధానం అనే చెప్పవచ్చు. సరైన ఆహారం తినకపోవడం, జంక్ ఫుడ్ అధికంగా తినడం, వ్యాయామం చేయకపోవడం, రాత్రి పూట ఆలస్యంగా నిద్రించడం, నిత్యం గంటల తరబడి కూర్చుని పనిచేయడం వంటివి కొలెస్ట్రాల్ పెరిగేందుకు కారణం అవుతున్నాయి. ఈ క్రమంలోనే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఒకటి ఎల్డీఎల్. దీన్నే చెడు కొలెస్ట్రాల్ అంటారు. అలాగే హెచ్‌డీఎల్ అని ఇంకో కొలెస్ట్రాల్ ఉంటుంది. దీన్నే మంచి కొలెస్ట్రాల్ అంటారు. మన శరీరంలో ఎల్డీఎల్ పెరగకుండా ఉండాలంటే హెచ్‌డీఎల్ స్థాయిలను పెంచాల్సి ఉంటుంది. ఇందుకు గాను పలు ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
మీరు వంటకు వాడే ఆయిల్స్‌లో మార్పు చేసుకోవడం వల్ల శరీర కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కూడా అదుపు చేయవచ్చు. ముఖ్యంగా కనోలా, సన్ ఫ్లవర్ వంటి ఆయిల్స్‌ను వాడడం వల్ల ఫలితం ఉంటుంది. అయితే వీటిని కోల్డ ప్రెస్డ్గా తీసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు. గానుగలో పట్టిన ఆయిల్స్ అయితే మంచిది. ఇవి ఎల్డీఎల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. హెచ్‌డీఎల్ స్థాయిలను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే తాజా పండ్లు, కూరగాయలను అధికంగా తినాల్సి ఉంటుంది. రోజూ భిన్న రకాల పండ్లతోపాటు పచ్చి కూరగాయల సలాడ్స్‌ను అధికంగా తింటుండాలి. వీటిలో అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతాయి.
మద్యం సేవించడం అలాగే పొగ తాగడం వల్ల శరీరంలో ఎల్డీఎల్ బాగా పెరిగిపోతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. కనుక ఈ రెండు అలవాట్లను మానేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గడాన్ని గమనించవచ్చు. దీంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. మనం నిత్యం వంటల్లో వాడే మసాలా దినుసులు కూడా ఎల్‌డీఎల్‌ను తగ్గించేందుకు సహాయ పడతాయి. ముఖ్యంగా లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, సోంపు గింజలు, పసుపు, వెల్లుల్లి, అల్లం వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఇవి గుండెను సైతం ఆరోగ్యంగా ఉంచుతాయి.
మటన్ లేదా బీఫ్‌ను అధికంగా తింటున్నా కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కనుక వీటికి బదులుగా చేపలు, ప్రాన్స్, స్కిన్ లెస్ చికెన్, కోడిగుడ్డు తెల్ల సొన వంటి ఆహారాలను తీసుకోవాలి. అలాగే పప్పు దినుసులను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటి వల్ల ఎల్డీఎల్ స్థాయిలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. రోజూ కనీసం 25 గ్రాముల సోయా ప్రోటీన్ ను తింటున్నట్లయితే ఎల్‌డీఎల్‌ను తగ్గించుకోవచ్చు. సోయా తోఫు లేదా పాలను కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. గుండెకు ఎంతో మేలు చేస్తాయి. హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. ఇలా పలు ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. గుండె పనితీరు మెరుగు పడుతుంది.