Fruits For Diabetics | ప్రస్తుత తరుణంలో చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. చాలా మందికి వంశ పారంపర్యంగా కూడా షుగర్ వస్తోంది. దీన్ని టైప్ 1 డయాబెటిస్‌గా చెబుతున్నారు. టైప్ 1 డయాబెటిస్ వస్తే క్లోమగ్రంథి అసలు పనిచేయదు. దీంతో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ అనేది అస్తవ్యస్తమైన జీవన విధానం వల్ల వస్తుంది. ప్రస్తుతం చాలా మంది చిన్న వయస్సులోనే టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ వస్తే ఆహారం విషయంలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే షుగర్ ఉన్నవారు ఏ పండ్లను తినాలి.. అని ఆలోచిస్తుంటారు. అయితే కొన్ని రకాల పండ్లను డయాబెటిస్ ఉన్నవారు తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ ఉన్నవారికి కివి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. పరిశోధనలు చెబుతున్న ప్రకారం కివి పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఒక కివి పండును తింటే షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. కివి పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే షుగర్ ఉన్నవారు రోజూ నేరేడు పండ్లను కూడా తినాలి. ఈ సీజన్లో ఈ పండ్లు మనకు అధికంగా లభిస్తాయి. కనుక సీజన్లో లభించే ఈ పండ్లను మిస్ చేసుకోకుండా తినాలి. నేరేడు పండ్లలో ఉండే సమ్మేళనాలు షుగర్‌ను సమర్థవంతంగా తగ్గిస్తాయి. అయితే షుగర్ తగ్గేందుకు నేరేడు విత్తనాలను కూడా తీసుకోవచ్చు. వీటి పొడి మనకు మార్కెట్లో లభిస్తుంది. దీన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ మోతాదులో కలిపి భోజనానికి 30 నిమిషాల ముందు రోజుకు 2 పూటలా తీసుకుంటే షుగర్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఈ చిట్కా షుగర్‌కు బాగా పనిచేస్తుంది.
ఇక తెల్ల నేరేడు పండ్లు కూడా మనకు లభిస్తాయి. వీటిని కూడా తినవచ్చు. ఇవి ఎక్కువగా మనకు సూపర్ మార్కెట్లలో అందుబాటులో ఉంటాయి. ఇవి సాధారణ నేరేడు పండ్ల జాతికి చెందినవే. అందువల్ల ఈ పండ్లను తింటున్నా కూడా షుగర్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే స్టార్ ఫ్రూట్‌ను తింటున్నా కూడా షుగర్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి స్టార్ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది. ఇవి చూసేందుకు ఆకుపచ్చ, పసుపు రంగు కలిసిన కలర్లో ఉంటాయి. నక్షత్రాల మాదిరిగా కనిపిస్తాయి. వీటిని తింటున్నా ఎంతో మేలు జరుగుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు జామకాయలను కూడా రోజూ తినాలి. జామ కాయల్లో విటమిన్లు ఎ, సిలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గించి డయాబెటిస్ అదుపులో ఉండేలా చేస్తాయి. జామకాయలను రోజూ తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది.
చెర్రీ పండ్లు కూడా షుగర్ ఉన్నవారికి మేలు చేస్తాయి. ఈ పండ్లు తియ్యగా ఉన్నప్పటికీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువే. ఇవి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా చెప్పవచ్చు. బెర్రీ పండ్లను తింటున్నా కూడా షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, క్రాన్ బెర్రీలను తింటే షుగర్ సమర్థవంతంగా అదుపులో ఉంటుంది. పైనాపిల్ కూడా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది. పైనాపిల్ పండ్లలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గించడంతోపాటు షుగర్ ను అదుపు చేయడంలో చక్కగా పనిచేస్తాయి. ఇలా పలు రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్‌ను అదుపు చేయవచ్చు. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.