Beetroot Juice | డయాబెటిస్ సమస్య ఉన్నవారు అనేక విషయాల్లో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారం లేదా పాటించే డైట్ విషయంలో చాలా జాగ్రత్తలను పాటించాలి. అయితే డయాబెటిస్ ఉన్నవారిని కూరగాయలు బాగా తినాలని వైద్యులు చెబుతుంటారు. అందుబాటులో ఉన్న దాదాపు అన్ని రకాల కూరగాయలను వారు తినవచ్చు. కానీ దుంపల విషయానికి వస్తే మాత్రం వాటిల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కనుక వాటిని తినొద్దని చెబుతుంటారు. అందుకనే డయాబెటిస్ ఉన్నవారు ఆలు వంటి వాటిని తక్కువగా తింటుంటారు. అయితే అన్ని రకాల దుంపలు డయాబెటిస్ ఉన్నవారికి కీడు చేయవు. కొన్ని మేలు కూడా చేస్తాయి. వాటిల్లో బీట్రూట్ కూడా ఒకటి.
డయాబెటిస్ ఉన్నవారు బీట్రూట్ను తినాలా, వద్దా అని సందేహిస్తుంటారు. అయితే నిత్యం కొద్ది మోతాదులో బీట్రూట్ను తినవచ్చు. లేదా బీట్రూట్జ్యూస్ను తాగవచ్చు. బీట్రూట్ జ్యూస్‌ను రోజూ తాగుతుంటే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడైంది. దీంతోపాటు పలు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని వారు చెబుతున్నారు. బీట్రూట్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్స్, పొటాషియం, ఇతర అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల బీట్రూట్ను వైద్యులు సూపర్ ఫుడ్‌గా కూడా చెబుతుంటారు. బీట్రూట్ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మలబద్దకం నుంచి బయట పడవచ్చు. రోజూ విరేచనం సాఫీగా అవుతుంది.
బీట్రూట్లో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. కనుక బీట్రూట్ జ్యూస్‌ను తాగితే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా శోషించుకుంటుంది. దీనివల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ మేరకు సైంటిస్టులు పరిశోధనలు కూడా చేశారు. రోజూ 225 ఎంఎల్.. అంటే అర కప్పు బీట్రూట్ జ్యూస్‌ను కొందరికి తాగమని ఇచ్చారు. ఈ క్రమంలో బీట్రూట్ జ్యూస్‌ను తాగిన వారిలో షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గాయని గుర్తించారు. అందువల్ల బీట్రూట్ జ్యూస్ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుందని వారు చెబుతున్నారు.
బీట్రూట్లో బీటెయిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులు, టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. బీట్రూట్ జ్యూస్‌లో బీటాలెయిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్లే బీట్రూట్ చూసేందుకు పింక్ రంగులో అలా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేసి శరీరాన్ని క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. దీంతోపాటు గుండె జబ్బులు కూడా రాకుండా అడ్డుకోవచ్చు. ఇలా బీట్రూట్ జ్యూస్ ఎంతగానో ఉపగయోపడుతుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు మాత్రమే కాదు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా బీట్రూట్ జ్యూస్‌ను రోజూ తాగవచ్చు. అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.