Daiabetes | నాలుగుపదులు దాటినవారిలో మధుమేహం సాధారణం. కానీ ముప్పైలలోనూ చక్కెర వ్యాధి ఆనవాళ్లు కనిపించడం ఆందోళనకరం. యువతలో మధుమేహాన్ని గుర్తించడానికి శరీరం కొన్ని సంకేతాలను వెలువరిస్తుంది. జాగ్రత్త పడకపోతే రోగం ముదిరి.. టైప్-2 డయాబెటిస్‌కు దారితీయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యువతలో మధుమేహం కేసులు పెరుగుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఊబకాయం, కదలికలు లేని జీవిత విధానం తదితరాలు ఈ దుస్థితికి కారకాలు.
నడి వయసు దాటినవారిలో కనిపించే టైప్-2 డయాబెటిస్ లక్షణాలు యువతలోనూ బయటపడుతున్నాయి. అధిక దాహం, అతి మూత్రం, అలసట, గాయాలు తొందరగా మానకపోవడం, పాదాల్లో తిమ్మిర్లు, దృష్టిదోషాలు మధుమేహులలో సర్వసాధారణం.
జీవనశైలి మార్పుల ద్వారా మధుమేహాన్ని నివారించగలం. ప్రొటీన్లతో సమృద్ధమైన ఆహారం తీసుకోవాలి. తక్కువ కార్బొహైడ్రేట్స్, తక్కువ కెలోరీలు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం తగ్గించుకోవాలి. వేళకు నిద్రించాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం ద్వారా ఒత్తిడిని నియంత్రించుకోవాలి. మధుమేహానికి మంచి ఔషధం వ్యాయామం. బ్రిస్క్ వాకింగ్, ఇంటిపనులు, తోటపని, కొద్దిపాటి బరువులను అటూయిటూ జరపడం, డ్యాన్స్ లాంటి శరీరాన్ని చురుగ్గా ఉంచే కార్యకలాపాల్లో నిమగ్నం కావడం వల్ల మధుమేహాన్ని తొలిదశలోనే అదుపులో తెచ్చుకోవచ్చు. ధూమపానం మానేయాలి.