మధుమేహం..ఇప్పుడు దీనిగురించి తెలియని వారుండరు. ఒకప్పుడు మధ్యవయస్సులో వచ్చే ఈ చక్కెర వ్యాధి..ప్రస్తుతం చిన్నతనం నుంచే వెంటాడుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో దీనిబారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే గ్రామాలతో పోలిస్తే పట్టణ, నగర ప్రాంతాల్లో డయాబెటిక్ (షుగర్ వ్యాధి) రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన వ్యాయామం లేకపోవడం, విపరీత ఒత్తిడికి గురవడం లాంటి కారణాలు కూడా మధుమేహం సోకేందుకు కారణంగా చెప్పొచ్చు. అనారోగ్యం బారిన పడి టెస్ట్‌లు చేయించుకుంటే తప్పా చాలామందికి షుగర్ ఉన్నట్లు తెలియడం లేదు. 70 నుంచి 80 శాతం మంది చివరిదశలోనే వ్యాధి ఉన్నట్లు తెలుసుకొని ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క గ్రేటర్‌లోనే మధుమేహం బాధితులు అధికంగా ఉన్నట్లు వైద్య,ఆరోగ్య సంస్థల గణాంకాల ద్వారా తెలుస్తోంది.
అతిగా ఆకలివేయడం
అతిగా నీరసించిపోవడం
అతి మూత్రం, అతి దాహం
బరువు తగ్గిపోవడం
గాయాలు త్వరగా మానకపోవడం
చూపు మందగించడం
జీవన విధానం, మారుతున్న ఆహార అలవాట్లు, పని ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల డయాబెటిక్ వస్తుంది. చక్కెర స్థాయిలు (షుగర్ లెవల్స్) బ్యాలెన్స్‌గా ఉంటే ఎలాంటి సమస్యలు రావు. అదుపు తప్పితేనే పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. చాలామందికి ముదిరినాక వ్యాధి లక్షణాలు బయటపడుతాయి. ముందే గుర్తిస్తే క్రమంగా అదుపు చేయొచ్చు. ఇటీవల పిల్లలు కూడా డయాబెటిక్ బారిన పడుతున్నారు. కరోనా నేపథ్యంలో రెండేండ్లుగా ఈ సంఖ్య పెరుగుతోంది. ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడం, నాలుగుగోడల మధ్యే ఉండడం, గంటల తరబడి ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోవడం.
– డాక్టర్ రాకేష్ సాహె, ఎండ్రోక్రినాలజిస్టు, ఉస్మానియా దవాఖాన