Diabetes Patients Diet | నేటి ఉరుకుల పరుగుల బిజీ యుగంలో చాలా మంది నిత్యం ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటున్నారు. దీని వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది యువతకు టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. అయితే కేవలం ఒత్తిడి, ఆందోళన మాత్రమే కాకుండా అస్తవ్యస్తమైన జీవన విధానం కూడా ఈ వ్యాధి వచ్చేందుకు కారణం అవుతోంది. చాలా మంది సరిగ్గా వేళకు భోజనం చేయడం లేదు. రాత్రి పూట ఆలస్యంగా తింటున్నారు. ఆలస్యంగా నిద్రిస్తున్నారు. జంక్ ఫుడ్ తింటున్నారు. అలాగే వ్యాయామం సైతం చేయడం లేదు. ఇన్ని కారణాల వల్ల చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. అయితే ఇది వస్తే డాక్టర్ ఇచ్చే మందులతోపాటు డైట్లోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారమే షుగర్ లెవల్స్‌పై బాగా ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆకుపచ్చని కూరగాయలను, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్ లెవల్స్‌ను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పాలకూరను తీసుకోవాల్సి ఉంటుంది. ఆకుకూరలలో క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. షుగర్ ఉన్నవారికి ఆకుకూరలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఆకుకూరల్లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఆకుకూరల్లో లుటీన్ ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. శరీరం ఇన్సులిన్‌ను వాడుకోవడాన్ని ఎక్కువ చేస్తుంది. దీంతో షుగర్ అదుపులో ఉంటుంది. అలాగే తృణ ధాన్యాలను రోజూ తీసుకోవడం వల్ల కూడా షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఓట్స్, బ్రౌన్ రైస్ ఈ జాబితాకు చెందుతాయి. షుగర్ ఉన్నవారు అన్నంకు బదులుగా వీటిని తింటే వీటిలో ఉండే ఫైబర్ వల్ల పిండి పదార్థాలు అంత త్వరగా గ్లూకోజ్‌గా మారవు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇలా షుగర్ ఉన్నవారికి తృణ ధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి.
బాదంపప్పు, వాల్ నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు వంటి నట్స్, సీడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. వీటిల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక ఈ గింజలను తింటుంటే షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. శనగలు, రాజ్మా వంటి ఆహారాలను కూడా షుగర్ ఉన్నవారు తినవచ్చు. ఇవి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ అంత త్వరగా పెరగవు. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
దుంపలన్నింటిలోనూ చిలగడదుంపలు భిన్నమైనవని చెప్పవచ్చు. ఇతర దుంపల్లో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కనుక వాటిని తింటే షుగర్ లెవల్స్ అమితంగా పెరుగుతాయి. కానీ చిలగడదుంపల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కనుక ఈ దుంపలను తింటే షుగర్ లెవల్స్ పెరగవు. షుగర్ తగ్గుతుంది. కనుక షుగర్ ఉన్నవారు చిలగడదుంపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే కొవ్వు తీసిన పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా షుగర్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. పెరుగు ప్రొ బయోటిక్ ఆహారం. అంటే జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.