Depression Symptoms | నేటికాలంలో యువత ఎదుర్కొంటున్న మానసికపరమైన సమస్యలల్లో డిప్రెషన్ ఒకటి. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో డిప్రెషన్ తో బాధపడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా, స్త్రీ, పురుష బేధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. డిప్రెషన్ అనేది ఒకరకమైన సాధారణ మానసిక పరిస్థితి. ఇది మన ఆలోచనా విధానంపై, మన ప్రవర్తనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. డిప్రెషన్ తో బాధపడే వారు ఎల్లప్పుడూ విచారంగా, ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. అంతేకాకుండా డిప్రెషన్ కు గురి అయినప్పుడు మన శరీరం మానసిక, శారీరక లక్షణాలను చూపిస్తుంది.
డిప్రెషన్ తో బాధపడే వారు ఎల్లప్పుడూ ఏమీ తోచనట్టుగా ఉంటారు. ఇది మీరు ఎక్కువ సమయంతో డిప్రెషన్ తో బాధపడుతున్నారని సూచిస్తుంది. పిల్లలు, యువతలో ఈ డిప్రెషన్ కొన్నిసార్లు చికాకును కూడా కలిగిస్తుంది. అలాగే డిప్రెషన్ తో బాధపడే వారు ఆనందంగా జీవించలేరు. వారు చేసే రోజువారి కార్యకలాపాలపై కూడా ఆసక్తిని కనబరచరు. సమయాన్ని వృథాగా గడిపేస్తూ ఉంటారు. అంతేకాకుండా డిప్రెషన్ కారణంగా ఆకలి తగ్గుతుంది. తినడానికి కూడా వీరు ఆసక్తి చూపించారు. శరీర బరువు కూడా తగ్గుతారు. ఇక డిప్రెషన్ వల్ల కనిపించే లక్షణాలల్లో నిద్రలేమి కూడా ఒకటి. త్వరగా మేల్కోవడం, రాత్రి ఎంత ప్రయత్నించినప్పటికీ నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలను కూడా డిప్రెషన్ తో బాధపడే వారిలో మనం గమనించవచ్చు.
అలాగే డిప్రెషన్ తో బాధపడే వారు శారీరక అశాంతితో బాధపడతారని చెప్పవచ్చు. వీరికి శరీరం ఎప్పుడూ బరువుగా ఉంటుంది. కదలకుండా ఎక్కువ సమయం కూడా కూర్చోలేరు. సాధారణం కంటే కూడా ఈ సమస్యతో బాధపడే వారు తక్కువగా మాట్లాడతారు. డిప్రెషన్ కారణంగా శరీరం చూపించే లక్షణాలల్లో అలసట కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు ఎటువంటి పని చేయకపోయినప్పటికి ఎల్లప్పుడూ అలసటగా, నీరసంగా ఉంటారు. డిప్రెషన్ తో బాధపడే వారు ఎప్పుడూ కూడా నెగిటివ్ గా ఆలోచిస్తారు. వీరికి అపరాధ భావనలు ఎక్కువగా ఉంటాయి.
ఉదాహరణకు నేను ఓడిపోయాను, నేను లేకుండా ఉంటే నా కుటుంబం బాగుంటుంది, నేను ప్రతిదీ చెడగొడతాను వంటి వ్యతిరేక ఆలోచనలను కలిగి ఉంటారు. డిప్రెషన్ తో బాధపడే వారు చేసే పనిపై శ్రద్ద వహించలేరు. నిర్ణయాలు తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా డిప్రెషన్ తో బాధపడే వారిలో దీర్ఘకాలిక నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరికి లైంగిక కోరిక కూడా తగ్గుతుంది. అలాగే డిప్రెషన్ తో బాధపడే వారికి జీవితాన్ని ముగించాలనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఈ విధమైన లక్షణాలు కనిపించిన వెంటనే మానసిక వైద్యులను కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.