చిన్నారులకు సీజనల్ ఛత్రం
ఏప్రిల్,మే నెలల్లో రాజ్యమేలిన మండే ఎండలకు తెరదించుతూ జూన్‌లో తొలకరి పలకరిస్తుంది. నిప్పుల కుంపటిని తలపించే వాతావరణం.. నెమ్మదిగా చల్లబడుతుంది. అయితే వాతావరణంలో తేమ పెరిగి గాలి చల్లబడిపోవడం, వర్షాలకు మడుగులు, కుంటలు, చెరువులు, మురుగు కాలువలు నీటితో నిండిపోవడం వల్ల దోమలు, ఈగలు సహా రోగ కారక క్రిములు వృద్ధి చెందుతాయి. వీటివల్ల జలుబు, దగ్గు, జ్వరం, డెంగీ, మలేరియా వంటి వ్యాధులు చుట్టుముడతాయి. చిన్నపిల్లలకు ఈ సీజనల్ వ్యాధులు ప్రమాదకరంగా పరిణమిస్తాయి. ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులు అంటే ఏమిటి? ఎలాంటి రోగాలు వస్తాయి? వాటికి కారణాలేమిటి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? తదితర అంశాలను చర్చించుకుందాం.
వేసవి సెలవులలో పిల్లలు దాదాపు రెండు నెలలపాటు ఇంటికే పరిమితమవుతారు. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలు సమయానికి తినేలా చూస్తారు. మిగిలిన రోజుల కంటే కొంచెం ఎక్కువగా తినిపిస్తారు. దీంతో పిల్లలు ఎక్కువ విశ్రాంతికి అలవాటు పడతారు. ఈ క్రమంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతలోనే జూన్ వచ్చేస్తుంది. బడులు తెరుచుకుంటాయి. ఇండ్లకే పరిమితమైన పిల్లలు ఒక్కసారిగా బయటి వాతావరణంలోకి వచ్చేస్తారు. పొద్దున్నే నిద్రలేచి బడికి పరుగెత్తాలి. సాయంత్రం ఇంటికి రాగానే టీవీ, మొబైల్, హోంవర్క్, ట్యూషన్లు.. రాత్రయిపోతుంది. తినడం, పడుకోవడం మళ్లీ ఉదయమే లేచి బడికి పరుగెత్తడం.. ఇలా పిల్లల జీవనశైలి మారిపోతుంది.
అదనంగా, వేసవిలో వేడిగా ఉన్న వాతావరణం వర్షాల కారణంగా ఒక్కసారిగా మారిపోతుంది. దీనికితోడు అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం కొంత గందరగోళంగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తి కూడా కొంతమేరకు తగ్గిపోతుంది. జబ్బుల బారినపడే ఆస్కారమూ ఉంటుంది. సీజనల్ వ్యాధులకు గాలి, నీరు, దోమలే ప్రధాన కారణం. వర్షాల వల్ల కొత్తనీరు వస్తుంది. నాలాలు, కుంటల్లో దోమలు, ఈగల వృద్ధి జరుగుతుంది. ఫలితంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి.

గాలి ద్వారా
సాధారణంగా 1-5 ఏండ్ల వయసు పిల్లల్లో ఎడినాయిడ్స్ కండరాలు, టాన్సిల్స్ ఉంటాయి. ఎడినాయిడ్స్ కండరాలు గొంతు పైభాగంలో, ముక్కుకు కొంచెం వెనక ఉంటాయి. దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఇవి ముక్కులోనే అడ్డుకుంటాయి. ఇక టాన్సిల్స్ గొంతులో నోటి వెనకభాగంలో ఉంటాయి. పిల్లలు పెరిగే కొద్దీ ఎడినాయిడ్స్, టాన్సిల్స్ కనుమరుగైపోతాయి. వేసవికాలంలో వాతావరణంలో తేమ 20-30 శాతం లేదా అంతకంటే తక్కువే ఉంటుంది. అయితే, వర్షాకాలం ప్రారంభంతో ఒక్కసారిగా 80 శాతానికి మించి పెరుగుతుంది.
చలిగాలులు వీస్తుంటాయి. ఆ గాలి పీల్చడం వల్ల పిల్లల ముక్కులో ఉండే ఎడినాయిడ్స్ కండరాలు, గొంతులో ఉండే టాన్సిల్స్ ఉబ్బుతాయి. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చి, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగితే అది న్యుమోనియాకు దారితీసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై బడికి వెళ్లే పిల్లలు చల్లగాలిని పీల్చుకునే అవకాశాలు ఎక్కువ. బస్సులు, కార్లలో వెళ్లే పిల్లలకు.. కిటికీలు మూసి ఉంచడం వల్ల ముప్పు కొంచెం తక్కువే! బడికి వెళ్లిన తరువాత కూడా జాగ్రత్తగా ఉండాలి.
చల్లటి గాలి ఉండటం కూడా పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం, న్యుమోనియా వంటి సీజనల్ వ్యాధులు వచ్చే ఆస్కారం ఎక్కువ. పాఠశాలల్లో పిల్లలు తుమ్మినా, దగ్గినా జలుబు, దగ్గు, కరోనా వంటివి గాలి ద్వారా ఒకరినుంచి మరొకరికి సోకుతాయి. తరగతి గదుల్లో పిల్లలు దగ్గర దగ్గరగా కూర్చోవడం, కలిసి ఆడుకోవడం వల్ల అంటువ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి, పిల్లలను కంటికిరెప్పలా కాపాడుకోవాలి. బడికి వెళ్లేముందు తగిన జాగ్రత్తలు చెప్పాలి. మాస్క్ లాంటివి తప్పకుండా ఇచ్చి పంపాలి.
పగటి దోమలు – రాత్రి దోమలు
దోమలను రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి, రాత్రిపూట కుట్టే దోమలు. రెండు, పగటి వేళ కుట్టేవి. అనాఫిలిస్, క్యూలెక్స్ దోమలు రాత్రిపూట కుడతాయి. వీటి వల్ల మలేరియా, ఫైలేరియా (బోదకాలు), మెదడువాపు వంటివి వస్తాయి. బోదకాలు కోస్తాంధ్ర ప్రాంతంలో ఎక్కువ. దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాల్లో ‘ఈడిస్ ఈజిైప్టె’ దోమల ప్రభావం అధికం. ఇవి పగలు మాత్రమే కుడతాయి.
ఇతర దోమల్లా మురుగు నీటిలో ఉండవు.నిల్వ ఉన్న మంచి నీటిలో.. అంటే ఇండ్లలోని పూలకుండీలు, కూలర్లు, ఇంటి పరిసరాల్లో నీరు నిలిచిన కుంటలు, రబ్బరు టైర్లు వంటివాటిలో ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. పాఠశాల తరగతి గదుల్లో బెంచీల కిందిభాగం, మూత్రశాలలు.. ఈడిస్ట్ ఈజిైప్టె దోమలకు ఆవాసాలు అవుతాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పిల్లలు డెంగీ బారినపడే ఆస్కారం ఉంది. ఐదేండ్ల లోపు పిల్లలకు మెదడువాపు ప్రధాన శత్రువు. దీనివల్ల పిల్లలు మెదడు వాచిపోయి, ఫిట్స్ వచ్చి మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఈ వ్యాధికి పందులే వాహకాలు. కాబట్టి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం.
జాగ్రత్తలే శ్రీరామరక్ష
బయటికి వెళ్లే ప్రతిసారీ పిల్లలు కాటన్ మాస్క్ ధరించేలా జాగ్రత్త వహించాలి. దీనివల్ల కరోనాతోపాటు సీజనల్ వ్యాధుల నుంచి కూడా 80 శాతం మేర రక్షణ పొందవచ్చు. కాచి చల్లార్చిన నీటినే తాగించాలి. మినరల్ వాటర్‌పై నమ్మకం పెట్టుకోవద్దు. కాచి చల్లార్చిన నీరు ఇవ్వడం వల్ల నీటితో వచ్చే వ్యాధుల నుంచి 100 శాతం దూరంగా ఉంచవచ్చు. ఇక రాత్రిపూట పిల్లలకు లేత లేదా తెలుపు రంగు దుస్తులను వేయాలి. ఎందుకంటే, ముదురు రంగు దుస్తులు దోమలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. లేత రంగు దుస్తులైతే దోమల నుంచి కొంతవరకు రక్షణ పొందవచ్చు. బడికి వెళ్లేటప్పుడు పిల్లలు మోకాలి వరకు సాక్స్ ధరించడం ఉత్తమం.
రాత్రి సమయాల్లో దోమలు కుట్టకుండా దుప్పటి కప్పుకోవాలి. మస్కిటో రిపెల్లెంట్లు వాడటం వల్ల కూడా దోమల బారినుంచి రక్షణ పొందవచ్చు. ఆల్ ఔట్ లాంటి మస్కిటో రిపెల్లెంట్లను పిల్లల పక్కనే కాకుండా కొంతదూరంలో పెట్టాలి.
దోమతెరలు కూడా మంచి ఫలితాన్నే ఇస్తాయి. దోమల నివారణకు బేగాన్ స్ప్రే వంటివి పడకగదిలో పిచికారీ చేసినప్పుడు పిల్లలను ఓ మూడు నాలుగు గంటలపాటు ఆ గదిలోకి వెళ్లనీయకూడదు. ఇళ్లలో పూలకుండీలు, పాతసామాన్లు, కూలర్లు, ఏసీ, రబ్బరు టైర్లు వంటివాటిలో నీరు నిల్వ కాకుండాఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
టీకాలతో రక్షణ
సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి కొన్ని రకాల టీకాలు అందుబాటులోఉన్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు పిల్లలకు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించడం మంచిది. దీనివల్ల పలురకాల ఫ్లూ జ్వరాల నుంచి రక్షణ లభిస్తుంది. ఐదేండ్ల లోపు పిల్లలకు టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించాలి. పసరికల (జాండిస్) నుంచి రక్షణ పొందడానికి హెపటైటిస్-ఎ టీకా ఇప్పించాలి. ఇలాంటి ముందుజాగ్రత్త చర్యల ద్వారా పిల్లలను వానకాలం వ్యాధుల బారినుంచి కాపాడుకోవచ్చు. చదువులపై దృష్టి నిలిపేందుకు తగిన వాతావరణాన్ని కల్పించవచ్చు.
నిల్వనీటి నుంచి
వర్షాల కారణంగా చెరువులు, కుంటలు తదితర జలాశయాలలో కొత్తనీరు వచ్చి చేరుతుంది. ఈ నీటిని ఎంత వడపోసినా ఎక్కడో ఒకదగ్గర కలుషితం అయ్యే ప్రమాదం ఉంటుంది. కలుషిత జలం అనేక వ్యాధులకు ప్రధాన కారణం. గ్యాస్ట్రోఎంటరైటిస్ వ్యాధులైన వాంతులు, విరేచనాలు, కలరా, పచ్చకామెర్లు, అమీబియాసిస్ వంటివి అధికంగా వస్తాయి. విరేచనాలు ఎక్కువగా కావడంతో పిల్లలు డీహైడ్రేషన్ బారినపడతారు. వర్షాకాలంలో ఈగల బెడద కూడా ఎక్కువే. కలుషిత జలం, కలుషిత ఆహారం వల్ల ఎక్కువగా పచ్చకామెర్లు, టైఫాయిడ్ వంటివి పిల్లలపై దాడిచేస్తాయి. సాధ్యమైనంత వరకు కాచి చల్లార్చిన నీరే ఇవ్వాలి.
డాక్టర్ సురేష్ కుమార్ పానుగంటి
సీనియర్ పీడియాట్రిషియన్, పసిపిల్లల వైద్య నిపుణులు, యశోద హాస్పిటల్స్
సోమాజిగూడ, హైదరాబాద్