Daytime Sleepiness | మనలో చాలా మందికి పగటి పూట కునుకు తీసే అలవాటు ఉంటుంది. ఉద్యోగస్తులు మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్ర ముంచుకొచ్చి నానా ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని ఎమ్మెన్సీల్లో పగటి పూట నిద్ర పోవడానికి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. పగలు కునుకు తీయడం మంచిదని కొందరు చెప్తుండగా.. మరికొందరేమో ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. నిజానికి పగటిపూట కునుకు ఆరోగ్యానికి మంచిదా..? కాదా..?
మీరు తరచుగా పనులు మానేసి పగటి పూట నిద్రపోవాలని అనుకుంటున్నారా? మీరు అలసట లేదా మగతగా ఉంటున్నారా? చేసే పనులపై ఏకాగ్రత పెట్టడం కష్టంగా ఉందా? రాత్రి పూట 8 గంటలు నిద్రపోయినా ఇంకా నిద్రపోవాలని అనిపిస్తుందా? ఈ సంకేతాలు ఏమి సూచిస్తాయో.. మీరు ఏ చర్యలు తీసుకోవాలో.. అర్థం చేసుకోవడానికి ఈ కథనాన్ని అందిస్తున్నాం.
హైపర్సోమ్నియా అంటే..?
హైపర్సోమ్నియా అంటే మితిమీరిన నిద్ర. 6 నుంచి 8 గంటల నిద్ర పూర్తయిన తర్వాత కూడా పగటి పూట నిద్రపోవడాన్ని హైపర్సోమ్నియా అని వైద్య పరిభాషలో పిలుస్తుంటారు. తగినంత నిద్ర లేనప్పుడు అలసటగా అనిపిస్తుండటం చాలా సహజం. అయితే, పసిపాపలా నిద్రపోయిన తర్వాత కూడా అలసటగా అనిపిస్తే మనం ఈ పరిస్థితిపై శ్రద్ధ వహించాలని సూచిస్తున్నట్లుగా గుర్తించాలి.
హైపర్సోమ్నియాకు కారణాలేంటి..?
నార్కోలెప్సీ : ఇది మెదడును ప్రభావితం చేసే ఒక రుగ్మత. ఇది మన నిద్ర విధానాన్ని మారుస్తుంది. నార్కోలెప్సీతో బాధపడుతున్న వ్యక్తులు ఆఫీసు వేళల్లో, భోజనం చేస్తున్నప్పుడు లేదా ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు కూడా నిద్రపోతుంటారు.
స్లీప్ అప్నియా : ఇది నిద్రపోతున్న సమయంలో ఆగిపోయి పదే పదే శ్వాస తీసుకోవడం ప్రారంభించే రుగ్మత. ఇది స్లీపింగ్ సైకిల్‌ను ప్రభావితం చేస్తుంది. పగటి పూట నిద్ర పోయే వ్యక్తిని నీరసంగా మార్చేస్తుంది.
నిద్ర లేమి : మనం తగినంత నిద్ర పోందనప్పుడు, పగటిపూట అలసిపోయినట్లు అనిపించినప్పుడు నిద్ర లేమి సమస్య వస్తుంది.
ఇతర వైద్య పరిస్థితులు : మాంద్యం, ఆందోళన, ఊబకాయం కలిగి ఉండటం, మాదకద్రవ్యాలు, మద్యం అలవాటు ఉన్నవారిలో అతిగా నిద్ర పరిస్థితులు ఉంటాయి.
హైపర్సోమ్నియా లక్షణాలేంటి..?
రెస్ట్లెస్నెస్గా ఉంటుంది. జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి. ఆందోళన, చిరాకుగా అనిపిస్తుంది. స్పందించడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఏకాగ్రతతో ఉండలేరు. ఆకలి ఉండదు.
హైపర్సోమ్నియాను ఎదుర్కోవడమెలా..?
హైపర్సోమ్నియా చికిత్స దాని కారణాలపై ఆధారపడి ఉంటుంది. మందులు, జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా నయం చేసుకోవచ్చు. నార్కోలెప్సీ చికిత్సకు మోడఫినిల్, యాంఫేటమిన్ వంటివి మెలకువగా ఉండటానికి సాయపడతాయి. సీపీఏపీ సహాయంతో స్లీప్ అప్నియాకు చికిత్స చేయవచ్చు. ఆల్కహాల్, డ్రగ్స్, కెఫిన్ ఉండే ఆహారాలు మానుకోవాలి. మంచి నిద్ర అలవాట్లను అనుసరించాలి. అధిక పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి.
చివరగా..
సరిగా లేని నిద్ర విధానాలు మన పని తీరును, సంబంధాలను దెబ్బతీస్తాయి. మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం నిద్ర ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకోవాలి. అతి నిద్ర సమస్యలు కనిపించగానే వెంటనే వైద్యుడ్ని సంప్రదించి తగు చికిత్స తీసుకోవడం చాలా ఉత్తమం.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.