రంజాన్ నెలలో ముస్లింలు పగలంతా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. చంద్రోదయం తర్వాత మాత్రం ముందుగా ఖర్జూరం పండును అందులోనూ అజ్వా డేట్స్‌ను చాలామంది తీసుకుంటారు. ఎన్నో గంటలు కడుపు ఖాళీగా ఉన్న తర్వాత ఖర్జూరం తినడం వెనుక మతపరమైన ప్రాశస్త్యమే కాదు ఆరోగ్యపరమైన అంశాలూ ముడివడి ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ముస్లింలు ఈ నెలలో తమ ఉపవాసాన్ని ఖర్జూరం పండు తినడంతో ముగిస్తుంటారు. ముఖ్యంగా సాధారణమైన పండ్లకు భిన్నంగా నలుపు రంగులో ఉండే అజ్వా డేట్స్‌ను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి సౌదీ అరేబియాలోని మదీనా ప్రాంతంలో విరివిగా పండుతాయి. మృదువైన గుజ్జుతో ఉండే వీటి రుచి కూడా మిగతావాటికి భిన్నంగా ఉంటుంది. సాధారణంగానే ఖర్జూర పండ్లలో నీటి శాతం ఎక్కువ. అన్ని గంటలపాటు నీరూ ఆహారమూ లేకుండా ఉండేవారు వీటిని తీసుకుని కాసిన్ని మంచినీళ్లు తాగితే శరీరం నెమ్మదిస్తుంది. డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా ఉంటుంది. మహమ్మద్ ప్రవక్త కూడా ఉపవాసాన్ని ఇలాగే వదిలేవారని నమ్ముతారు. దాన్నే ఇప్పటికీ ముస్లింలు పాటిస్తున్నారు. వీటిలో ఉండే సహజ చక్కెరలు రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఒకేసారి పెరిగిపోకుండా చూస్తూనే దేహానికి శక్తినందిస్తాయి.
ఈ చక్కెరలు సులభంగా జీర్ణమవుతాయి కూడా. రోజంతా ఉపవాసం ఉన్నాక ఇవి తినడం వల్ల పొట్ట మీద ఒకేసారి భారం పడదన్నమాట! అంతేకాదు, ఈ పండ్లలో పుష్కలంగా ఉండే పీచులు జీర్ణాశయ ఆరోగ్యానికి మేలుచేస్తాయి. ఇందులో ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ (వాపుల్ని తగ్గించే) గుణాలు రోజంతా ఖాళీగా ఉన్న పొట్టకు సాంత్వన చేకూరుస్తాయి. వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజాలు రక్తపోటును, తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాదు, తగిన మోతాదులో చక్కెరలు, పీచులు, ఇతర పోషకాలు కలిగి ఉండే ఈ చిన్న పండ్లు సాయంకాలం మొత్తం ఉత్సాహంగా గడిపేందుకు కావలసినంత శక్తినీ అందించగలవు. అదన్నమాట… ఇఫ్తార్ విందులో ఖర్జూర పండ్ల రహస్యం!