శీతాకాలంలో వీచే చలిగాలులకు దగ్గు, జలుబు, జ్వరంతోపాటు పిల్లల్లో పెదాలు పొడిబారడం, పెద్దల్లో పాదాలకు పగుళ్లు రావడం లాంటి సమస్యలు తరచుగా కనిపిస్తాయి. కాలి మడమల్లో పగుళ్లు సాధారణమే అయినా నివారణ చర్యలు తీసుకోకపోతే సమస్య తీవ్రమవుతుంది.
సహజంగానే పాదాల చర్మంలో నూనె గ్రంథులు తకువగా ఉంటాయి. శీతాకాలంలో ఈ నూనెలు మరింత తగ్గడంతో మడమల దగ్గర పగుళ్లు ఏర్పడతాయి. వయసు పెరిగే కొద్దీ చర్మం దాని స్థితిస్థాపకతను కోల్పోతుంది. సహజ నూనెల ఉత్పత్తి సైతం తగ్గుతుంది. దీనివల్ల పెద్దవాళ్లలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది.
మరోవైపు వాతావరణం చల్లగా ఉండటం, తగినంత నీరు తాగకపోవడం మూలంగా శరీరంలో తేమ లోపించి మడమల పగుళ్లకు దారి తీస్తుంది. మడమలు పగిలిన భాగంలో చర్మం పొకులు పొకులుగా లేచి రాత్రి పూట పడుకున్నప్పుడు బెడ్ షీట్ తగిలినా నొప్పిలేస్తుంది. మట్టిలో తిరిగే వారికి బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ పగుళ్ల సమస్యతో మహిళలే ఎకువగా ఇబ్బంది పడుతుంటారు. వీటి నుంచి మీ పాదాలు రక్షించుకోవడానికి రోజూ పాదాలను గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
వాతావరణంతో సంబంధం లేకుండా సరిపడా నీళ్లు తాగాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. రోజుకు రెండుసార్లు పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వృద్ధులు, మధుమేహ బాధితులు రాత్రిపూట సాక్స్‌లు ధరించడం వల్ల చలిగాలి నుంచి తప్పించుకోవచ్చు. వేడి నీటితో కాకుండా గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం ఉత్తమం. ఆహారంలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే విత్తనాలు, గింజలు, విటమిన్ సి కలిగిన పండ్లు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే పగుళ్లు మాయం అవుతాయి.