ఆరోగ్యం విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే కొన్నిరకాల అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వానల వేళ మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా దగ్గు, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) సమస్యలతో బాధపడుతున్నవాళ్లు ఆహారం విషయంలో చేయాల్సిన, చేయకూడని పనులు కొన్ని ఉంటాయి.
శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు యాంటి ఇన్ఫ్లమేటరీ ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్రతిరోజూ ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో తీసుకునే ఆహారం అతి వేడిగా లేదా మరీ చల్లగా ఉండొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు చల్లటి ఐస్ క్రీమ్, యోగర్ట్ లాంటివి తీసుకుంటే గొంతులోని పొరలు దెబ్బతిని దగ్గు సమస్య పెరుగుతుంది. అలాగే వేడివేడి సూప్స్, పానీయాలు తాగినా గొంతులో చికాకు, నొప్పి అధికమవుతాయి.
ఆస్తమా, సీఓపీడీతో బాధపడేవాళ్లు మంచి ఫ్యాట్స్ ఉండే అవిసె గింజలు, వాల్ నట్స్, సాల్మన్ చేపలు, ఫిష్ ఆయిల్ తీసుకోవాలి. మంచి కొవ్వులు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే ఇవి శరీరంలోని ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. ప్రస్తుతం ఫ్రిజ్ వాడకం పెరగడం వల్ల చాలారకాల ఆహార పదార్థాలను అందులో పెట్టేస్తున్నారు. దాంతో వెంటనే వాటిలోంచి తీసి చల్లగా ఉన్నప్పుడే తింటున్నారు. అలాకాకుండా వాటిని కొద్దిసేపు బయటపెట్టి చల్లదనం తగ్గాక తీసుకున్నా మంచిదని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్లు. అలాగే వేడివేడిగా ఉన్నవి తిన్నా, తాగినా దగ్గు పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందట. అందువల్ల ఈ వర్షాకాలంలో శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు అందరికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.