Cough Home Remedies | సీజన్లు మారినప్పుడు సహజంగానే చాలా మందికి దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటాయి. అయితే జలుబు, జ్వరం తగ్గుతాయి కానీ దగ్గు మాత్రం అలాగే ఉంటుంది. ముఖ్యంగా జలుబు తగ్గే దశలో దగ్గు విపరీతంగా వస్తుంది. కొందరికి జలుబు లేకపోయినా విపరీతంగా దగ్గు మాత్రం ఉంటుంది. ఇది తీవ్ర ఇబ్బందిని కలగజేస్తుంది. అయితే దగ్గు నుంచి బయట పడాలంటే చాలా మంది మెడిసిన్‌ను తెచ్చి వేసుకుంటారు. దగ్గు సిరప్ తాగుతారు. కానీ ఆ అవసరం లేదు. పలు ఇంటి చిట్కాలను పాటిస్తే చాలు, దగ్గు వెంటనే తగ్గిపోతుంది. అలాగే ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇక దగ్గు తగ్గేందుకు పాటించాల్సిన ఆ ఇంటి చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దగ్గును సహజసిద్ధంగా తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. తేనె సహజసిద్ధమైన డిమల్సెంట్గా పనిచేస్తుంది. గొంతులో ఏర్పడే గరగరను తగ్గిస్తుంది. దీంతో దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనెలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం తేనెను వాడడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చని తేలింది. ఇక తేనెను ఎలా వాడాలంటే.. 1 లేదా 2 టీస్పూన్ల తేనెను నేరుగా అలాగే తినాలి. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఈ విధంగా తేనెను తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉప్పు నీటిని గొంతులో పోసుకుని పుక్కిలిస్తున్నా కూడా గొంతులో ఏర్పడే గరగర, దగ్గు, నొప్పి తగ్గుతాయి. అందుకు ఏం చేయాలంటే పావు టీస్పూన్ నుంచి అర టీస్పూన్ ఉప్పును 200 ఎంఎల్ గోరు వెచ్చని నీటిలో బాగా కలపాలి. ఈ నీళ్లను గొంతులో పోసుకుని 30 సెకన్ల పాటు పుక్కిలించాలి. తరువాత ఉమ్మేయాలి. ఇలా రోజుకు 3 లేదా 4 సార్లు చేస్తున్నా కూడా దగ్గు తగ్గిపోతుంది.
దగ్గు సమస్య ఉన్నవారు ద్రవాలను అధికంగా తీసుకోవాలి. దీని వల్ల కఫం కరిగి బయటకు వస్తుంది. దగ్గు తగ్గిపోతుంది. గోర వెచ్చని నీళ్లు, సూప్, గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి, పుదీనా టీ వంటివి తాగాలి. అయితే దగ్గు ఉన్నవారు కెఫీన్ ఉండే టీ, కాఫీలను కొద్ది రోజుల పాటు తాగడం మానేస్తే మంచిది. బదులుగా హెర్బల్ టీ లేదా గ్రీన్ ఈ వంటివి సేవించాలి. కొందరు మద్యం సేవిస్తే దగ్గు, జలుబు తగ్గిపోతాయని భావిస్తారు. కానీ ఇందులో నిజం లేదు. నిజానికి మద్యం సేవిస్తే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో గొంతు త్వరగా తడి ఆరిపోతుంది. అప్పుడు దగ్గు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక దగ్గు ఉన్నవారు మద్యం సేవించకూడదు.
దగ్గు తగ్గేందుకు అల్లం కూడా అద్భుతంగానే పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి దగ్గును తగ్గేలా చేస్తాయి. చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి తాగుతుండాలి. లేదా నేరుగా ఒక టీస్పూన్ అల్లం రసం సేవించవచ్చు. రోజుకు 3 సార్లు ఇలా చేస్తుంటే ఫలితం ఉంటుంది. తులసి ఆకులను నేరుగా నమిలి తింటున్నా కూడా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను కూడా తాగవచ్చు. అతి మధురం చూర్ణం కూడా దగ్గును తగ్గించేందుకు అద్భుతంగానే పనిచేస్తుంది. దీన్ని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా పలు ఇంటి చిట్కాలను పాటిస్తే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే 2 వారాలకన్నా ఎక్కువగా దగ్గు ఉన్నా తరచూ కఫం పడుతున్నా కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు.