Cooking Oils | వంటలు చేయడానికి సాధారణంగా మనం వాడే పదార్థాల్లో నూనె కూడా ఒకటి. భారతీయ వంటకాల్లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. పప్పు, పచ్చడి, పులుసు, కూర ఎలా ఏ వంటకాలు చేసినా మనం నూనెను ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే మనం తినే చాలా రకాల చిరుతిండ్లు నూనెలో వేయించినవే. ఇక కొన్ని వంటకాలను డీప్ ఫ్రై చేస్తూ ఉంటాము. అలాగే వివిధ రకాల చిరుతిళ్లను కూడా నూనెలో వేసి వేయించి తింటూ ఉంటాం. వంటకాలు పూర్తి అయిన తరువాత ఈ డీప్ ఫ్రైకు వాడిన నూనెను చాలా మంది నిల్వ చేసుకుని మరలా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా మనలో చాలా మంది చేస్తూ ఉంటారు. అయిన వాడిన నూనెను తిరిగి వాడడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. భారతదేశంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. కనుక నూనెను తిరిగి వాడడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
నూనెను పదే పదే వేడి చేయడం వల్ల వాటిలో విష పదార్థాలు ఏర్పడతాయి. ఇవి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తాయని వారు తెలియజేస్తున్నారు. భారతీయుల ఇండ్లల్లో నూనెను మరలా మరలా వాడడం మనం చూస్తూనే ఉంటాం. ఇలా చేయడం వల్ల కొవ్వు ఆమ్లాలు విచ్చనమై ఫ్రీరాడికల్స్ ను విడుదల చేస్తాయి. నూనెను ఎంత ఎక్కువగా వేడి చేస్తే ఫ్రీరాడికల్స్ అంత ఎక్కువగా విడుదల అవుతాయి. ఫ్రీరాడికల్స్ శరీరం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను పెంచడంలో, ట్రైగ్లిజరైడ్స్ ను పెంచడంలో, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచడంలో, వాపులను ప్రేరేపించడంలో, ఇన్సులిన్ నిరోధకతను పెంచడంలో ఫ్రీరాడికల్స్ పాత్ర ఎంతో ఉంది. కాలక్రమేణా ఇది గుండె జబ్బులు, డయాబెటిస్, ఫ్యాటీ లివర్, క్యాన్సర్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది.
అలాగే కొందరు వాడిన నూనెను నిల్వ చేయడంలో కూడా తప్పులు చేస్తూ ఉంటారు. వాడిన నూనెపై మూత ను సరిగ్గా ఉంచరు. దీని వల్ల ఆక్సీకరణం త్వరగా జరిగి ఫ్రీరాడికల్స్ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కనుక వాడిన నూనెను మూత ఉంచిన డబ్బాలో పోసి చల్లటి, చీకటి ప్రదేశాల్లో ఉంచి మాత్రమే నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆక్సీకరణ తగ్గుతుంది. ఫ్రీరాడికల్స్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇక వాడిన నూనెను మరలా వాడాలి అనుకునే వారు దీనిని తాజా నూనెతో కలిపి వాడడం మంచిది. ఇలా చేయడం వల్ల నూనె ఎక్కువగా విషపూరితం అవ్వదు. కానీ దానిలో ఉండే హానికారక సమ్మేళనాలు తగ్గవు. నూనెను మరలా వాడడం వల్ల దానిలో ఉండే పోషకాలు కూడా తగ్గుతాయి.
పొట్ట, గుండెతో పాటు శరీర ఆరోగ్యానికి కూడా తీవ్ర హాని కలుగుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. కనుక వాడిన నూనెను మరలా వాడకపోవడమే మంచిదని వారు సలహా ఇస్తున్నారు. అలాగే చాలా మంది వంటల్లో పొద్దుతిరుగుడు నూనెను వాడుతూ ఉంటారు. దీనికి బదులుగా పల్లి నూనె, ఆవాల నూనె, కొబ్బరి నూనె, నెయ్యి వంటి వాటిని ఉపయోగించడం మంచిదని అలాగే నెలకొకసారి తీసుకునే నూనెలను మార్చాలని వారు చెబుతున్నారు. ఏదో ఒకే రకమైన నూనెపై అతిగా ఆధారపడడం కూడా మంచిది కాదని వారు సూచిస్తున్నారు.