Health Tips | వానకాలంలో పరిసరాలు ఆకుపచ్చగా మారిపోతాయి. కంటికి ఆహ్లాదాన్ని ఇస్తాయి. అయితే, ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఈ కాలం సహజంగానే రోగాలకు అనువైన కాలం. వేసవితో పోలిస్తే వర్షాకాలంలో ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటివి ప్రజలను అనారోగ్యాలకు గురిచేస్తుంటాయి. ఇవే కాకుండా వివిధ రకాలైన ఇన్ఫెక్షన్లు కండ్లను కూడా ప్రభావితం చేస్తాయి. ఈ కాలంలో కండ్లకు వచ్చే రోగాల్లో ప్రధానమైనది కండ్లకలక.
దీనిలో బ్యాక్టీరియా లేదా వైరస్‌తో కూడిన కండ్లకలక ఉండవచ్చు. ఇది అంటువ్యాధి. ఒకరినుంచి మరొకరికి సోకుతుంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఇది కంటి అల్సర్లకు దారితీస్తుంది. ఒక్కోసారి కంటిచూపు పోయే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి వానకాలంలో కంటి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన చికిత్స మొదలైన అంశాలపై అవగాహన ఉండాలి.
వర్షాకాలంలో కండ్లకు సంబంధించిన సమస్యల్లో ప్రధానమైంది కండ్లకలక. కంటిలో తెల్లటి భాగాన్ని, కనురెప్పల లోపలి భాగాలను కప్పి ఉంచే పల్చటి శ్లేష్మపు పొరను కంజంక్టివా అంటారు. ఈ పొరకు వచ్చే ఇన్ఫ్లమేషన్ను కండ్లకలక (కంజంక్టివైటిస్) అని పిలుస్తారు. ఇది వైరస్, బ్యాక్టీరియాల మూలంగా వచ్చే ఇన్ఫెక్షన్లు, పారాసైట్ల పీడనం, అలర్జీల వల్ల తలెత్తుతుంది. అంతే కాకుండా ఎడినోవైరస్ వంటి ఒక ప్రత్యేక వైరస్ల సమూహం కారణంగా కూడా ఫోలిక్యులర్ కండ్లకలక రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది కంటి అల్సర్లకు దారితీస్తుంది. సకాలంలో సరైన చికిత్స అందించకపోతే ఈ అల్సర్ల కారణంగా చూపు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. కాగా, కండ్లకలకలో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి.. ఫారింగో-కంజంక్టివల్ ఫీవర్(పీసీఎఫ్). రెండోది ఎపిడెమిక్ కెరటో కంజంక్టివైటిస్.
ఫారింగో కంజంక్టివల్ ఫీవర్ రకం కండ్లకలక వచ్చినవారిలో గొంతునొప్పి ఉంటుంది. దీని తీవ్రత తేలికపాటిగానే ఉన్నప్పటికీ ఇది తరచుగా వస్తుంది. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఉన్న పిల్లలు, యువతరంలో ఈ రకమైన కండ్లకలక ఎక్కువగా కనిపిస్తుంది. పైగా వానకాలంలో వ్యాపించే కండ్లకలక కేసుల్లో పీసీఎఫ్ కేసులే అధికం.
ఇది తీవ్రమైన కండ్లకలక. ఇది చాలా తక్కువమందిలో కనిపిస్తుంది. దీని ప్రభావం కొంచెం తీవ్రంగానే ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ఇది కంటి ముందుభాగాన్ని అంటే కార్నియాను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక దృష్టి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
కండ్లపై ఎడినోవైరస్ ప్రభావం వల్ల కండ్లకలక సోకుతుంది. సాధారణంగా వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉంటుంది. వైరస్లు వృద్ధి చెందడానికి ఈ తేమ అనుకూలంగా మారుతుంది. దీంతో వర్షాకాలంలో రకరకాల వైరస్లు వృద్ధి చెందుతాయి. వీటిలో ఒకటే ఎడినోవైరస్. అయితే ఎడినోవైరస్ సోకినంత మాత్రాన కండ్లకలక రాదు. దీనిలోని కొన్ని ప్రత్యేక స్ట్రెయిన్ల వల్ల మాత్రమే ఈ సమస్య తలెత్తుతుంది. దీని ప్రభావం వారం నుంచి 10 రోజులపాటు ఉండవచ్చు. ఇక ఇన్ఫెక్షన్ ప్రభావం అందరిలోనూ ఒకేలా ఉండదు. ఒక్కో రోగిలో వైరస్ ఒక్కోలా రూపాంతరం చెంది, వేర్వేరు లక్షణాలను చూపిస్తుంది. ఎడినోవైరస్లో 51 రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. వాటిలో 3, 4, 7వ స్ట్రెయిన్స్ వల్లనే కండ్లకలక వస్తుంది. ఈ మూడు స్ట్రెయిన్స్‌ను కలిపి సీరోటైప్స్ అంటారు.

వర్షం కురిసినప్పుడు కండ్లలోకి నీరు పోవడం, కలుషితమైన నీటితో ముఖం కడుక్కున్నప్పుడు నీరు కండ్లలోకి వెళ్లడం వల్ల కండ్లకలక వస్తుంది. అంతేకాకుండా బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కండ్లపై ప్రభావం చూపినప్పుడు, కండ్లకలక సోకిన వ్యక్తి ద్వారా కూడా ఇతరులకు వ్యాధి వ్యాపిస్తుంది.

కండ్లకలక అంత ప్రమాదకరమైన వ్యాధి కాదు. కానీ వ్యాధి వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. లక్షణాలు కనిపించిన వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుడి సూచన మేరకు యాంటి బయాటిక్ మందులు, ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్ వాడాల్సి ఉంటుంది.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ రాజలింగం సూపరింటెండెంట్ సరోజినీదేవి కంటి దవాఖాన