వానాకాలం మధ్యలోకి వచ్చేశాం. ముసుర్లు, ఓ మోస్తరు వానల్లో తడవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా జలుబు, దగ్గు లాంటి సమస్యలు పట్టి పీడిస్తుంటాయి. అయితే, దగ్గు, జలుబులు మామూలు వ్యాధులే అయినా, వీటి చుట్టూ మనలో ఎన్నో అపోహలు ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకుంటే మంచిది.
బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకే యాంటిబయాటిక్స్ అవసరమవుతాయి. దగ్గు, జలుబులేమో వైరస్ల వల్ల వస్తాయి. కాబట్టి, యాంటిబయాటిక్స్ తరచుగా, క్రమరహితంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచి కంటే చెడే ఎక్కువ.
ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా రోగాలు వస్తాయి. సాధారణంగా, జలుబు కారణంగా మ్యూకస్ (శ్లేష్మం) ఉత్పత్తి అవుతుంది. ఇక పెరుగులో ప్రొబయాటిక్స్ ఉంటాయి. ఇందులో ఉండే బ్యాక్టీరియా నిజానికి మనిషి ఆరోగ్యానికి మేలుచేస్తుంది.
డాక్టర్ సూచన లేకుండా మందుల దుకాణాల్లో కొనే టానిక్లు హానికరమైనవి. వీటి వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో. అవి కేవలం రోగ లక్షణాలను మరుగునపరుస్తాయి. అలా రోగం నుంచి ఉపశమనం కలగజేస్తాయి.
పిల్లల్లో దగ్గు, జలుబు తరచుగా వస్తుంటే… అది అలర్జీకి సంకేతం. అంతేతప్ప బలహీనమైన రోగ నిరోధక శక్తికి సూచన కాదు.
బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిన దగ్గు ఇతరులకు వ్యాపిస్తుంది. అదే అలర్జీ, ఆస్తమా, శ్వాసనాళంలో మంట కారణంగా అయితే మాత్రం చాలావరకు ఇతరులకు వ్యాపించవు.
ఏడాదికోసారి డాక్టర్లు సూచించే ఫ్లూ వ్యాక్సిన్లలో క్రియాశీలం కాని వైరస్లు ఉంటాయి. ఇవి మళ్లీ ఇన్ఫెక్షన్లకు ఎంతమాత్రం కారణం కాదు. కాబట్టి, ప్రతి ఏటా పిల్లలకు ఫ్లూ టీకాలు వేయించవచ్చు.
దగ్గు, జలుబు సాధారణంగా వైరస్ల కారణంగా వస్తాయి. ఇవి రోగుల దగ్గర్లో ఉన్నవారికి ఒకరినుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలను ఇంట్లోనే ఉంచాలి. తగిన చికిత్స అందించాలి.