Coffee Side Effects | రోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది కాఫీని సేవిస్తుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తరువాత నుంచి మొదలుకొని రోజంతా నాలుగైదు కప్పుల కాఫీ తాగనిదే చాలా మందికి తృప్తిగా అనిపించదు. అయితే కాఫీని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ కాఫీని మరీ మోతాదుకు మించి తాగకూడదు. కాఫీని అతిగా సేవించడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాఫీ సేవిస్తే టైప్ 2 డయాబెటిస్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కానీ మోతాదుకు మించి కాఫీని తాగడం వల్ల అనేక దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాఫీ మన నాడీ మండల వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. దీంతో ఆందోళన, కంగారు, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి.
కాఫీని మోతాదుకు మించి సేవిస్తే అది నిద్రపై ప్రభావాన్ని చూపిస్తుంది. రాత్రి పూట త్వరగా నిద్ర పట్టదు. నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మన శరీరంలో కెఫీన్ మోతాదు అధికమైతే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాఫీ మోతాదుకు మించితే జీర్ణాశయంలో యాసిడ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో గుండెల్లో మంట, పొట్టలో అసౌకర్యం వంటి సమస్యలు ఏర్పడుతాయి. అలాగే కాఫీ సహజసిద్ధమైన లాక్సేటివ్గా పనిచేస్తుంది. ఇది సున్నితమైన జీర్ణాశయం ఉన్నవారిలో విరేచనాలను కలగజేస్తుంది. కాఫీలో ఉండె కెఫీన్ మన శరీరంలో అధికంగా చేరితే బీపీ పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో హైబీపీ సమస్యకు దారి తీస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం దెబ్బ తిని హార్ట్ ఎటాక్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
కాఫీ డైయురెటిక్‌గా పనిచేస్తుంది. ఇది మూత్రం ఉత్పత్తిని పెంచుతుంది. దీంతో శరీరంని నీరు త్వరగా బయటకు పోతుంది. ఫలితంగా డీహైడ్రేషన్ బారిన పడతారు. కనుక కాఫీని అధికంగా తాగకూడదు. కాఫీ తాగడం వల్ల మూడ్ మారుతుంది. ఉత్తేజంగా మారుతారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. అయితే కేవలం ఒక కప్పు కాఫీ తాగితేనే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. మోతాదుకు మించి కాఫీ సేవిస్తే దీనికి శరీరం రివర్స్‌లో పనిచేస్తుంది. అంటే శక్తి మొత్తం కోల్పోయినట్లు అవుతారు. నీరసం, అలసట వస్తాయి. ఏ పనిచేయలేకపోతారు. కనుక కాఫీని అధికంగా తాగుతున్న వారు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. కాఫీని మోతాదులో సేవిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ అధికంగా సేవిస్తే మాత్రం తలనొప్పి ఎక్కువవుతుంది.
కాఫీని రోజూ ఎంత మోతాదులో సేవించాలి.. అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. కాఫీ రోజుకు 2 కప్పులకు మించకూడదు. ఒక కప్పు కాఫీ తాగితే మనకు సుమారుగా 200 మిల్లీగ్రాముల మేర కెఫీన్ లభిస్తుంది. నిపుణులు చెబుతున్న ప్రకారం మనకు రోజుకు 400 మిల్లీగ్రాముల మేర కెఫీన్ సరిపోతుంది. అందువల్ల రోజుకు 2 కప్పుల కాఫీని సేవిస్తే చాలు. అంతకు మించితే అనేక దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.