వేసవితాపాన్ని తీర్చడంలో కొబ్బరినీళ్లు ముందుంటాయి. పొటాషియం, మెగ్నీషియం, సోడియంలాంటి ఎలక్ట్రోలైట్లతోపాటు అనేక పోషకాలతో నిండిన ఈ నీళ్లు.. ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంతోపాటు కండరాలు, నరాల పనితీరుకు మద్దతునిస్తాయి. అలాంటి కొబ్బరినీళ్లకు ఇతర పదార్థాలను జోడించడం ద్వారా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి.
పుదీనా : కొబ్బరి నీళ్లకు పుదీనాను జోడిస్తే.. అద్భుతమైన రిఫ్రెషింగ్ డ్రింక్ తయారవుతుంది. ఇది శరీరాన్ని చల్లబరచడంతోపాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సమర్థంగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. పుదీనాలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు.. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
నిమ్మరసం : విటమిన్ సితోపాటు హైడ్రేషన్‌కు మద్దతునిచ్చే ఎంజైమ్‌లు నిమ్మరసంలో పుష్కలంగా ఉంటాయి. ఆమ్ల స్వభావం కలిగిన నిమ్మరసం, ఆల్కలీన్ కొబ్బరినీళ్లతో కలిసి.. శరీర పీహెచ్‌ను సమతుల్యం చేయడంలో సాయపడుతుంది.
తేనె : కొబ్బరినీళ్లకు తేనె కలిపి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతున్నది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైములు, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొబ్బరినీటిలోని ఖనిజాలతో కలిసి.. ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.
చియా విత్తనాలు : ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే చియా విత్తనాలను కొబ్బరినీళ్లలో కలిపితే.. శరీరానికి కావాల్సిన శక్తినిచ్చే పానీయం సిద్ధమవుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం ఎక్కువసేపు హైడ్రేటెడ్‌గా ఉండటంలో సహాయపడుతుంది. గుండె, మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.
నల్ల ఉప్పు : కొబ్బరినీళ్లలోని పొటాషియం, మెగ్నీషియం.. నల్ల ఉప్పులోని సోడియం, ఐరన్, సల్ఫర్ వంటి ఖనిజాలు కలిసి.. ఎలక్ట్రోలైట్ రిచ్ డ్రింక్‌గా తయారవుతుంది. నల్ల ఉప్పులోని కార్మినేటివ్ లక్షణాలు.. ఆకలిని నిరోధిస్తాయని ఆయుర్వేదం చెబుతున్నది. ఇవి కొబ్బరినీళ్లతో కలిసినప్పుడు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.