మానవ శరీర ప్రధాన వ్యవస్థల్లో మూత్రపిండాలు ఒకటి. రక్తాన్ని శుద్ధి చేయడంలో, రక్తపోటును నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటు, మధుమేహం నియంత్రణలో లేకపోతే కిడ్నీలు ప్రమాదంలో పడినట్టే. కాబట్టి, బీపీ, షుగర్ ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, జీవితకాలం మందులు వాడేవారు, పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్‌కు అలవాటుపడిన వారు.. తరచూ మూత్రపిండాల పనితీరును పరీక్షించుకోవాలి. అందులోనూ, ఈ మధ్యకాలంలో కిడ్నీ వ్యాధులు పెరిగిపోతున్నాయి. డయాలసిస్ రోగుల సంఖ్య కూడా అధికం అవుతున్నది. మనదేశంలో 18 శాతానికి పైగా జనాభాకు ఏదో ఒక రకం కిడ్నీ జబ్బులు ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్ కూడా మూత్రపిండ వ్యాధులకు దారితీస్తున్నాయి. అందువల్ల, ఈ తరహా ఔషధాలు అనివార్య మైనప్పుడు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మూత్రపిండ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. నేటి ఊపిరిలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు కిడ్నీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన చేసుకుందాం.
మూత్రపిండాల వైఫల్యానికి తొలికారణం మధుమేహం. రెండో కారణం హైపర్‌టెన్షన్. మూడో కారణం కిడ్నీలో రాళ్లు. ఇవన్నీ కాకుండా.. విచ్చలవిడిగా మందుల వాడకమూ రోగుల పాలిట గండంగా మారుతున్నది. అందులోనూ పెయిన్ కిల్లర్స్ తొలి ముద్దాయిగా నిలుస్తున్నాయి. బీపీ, షుగర్, క్యాన్సర్, హెచ్ఐవీ, టీబీ, కాలేయ వ్యాధులు, గుండె రుగ్మతలు, థైరాయిడ్, ఆర్థరైటిస్ లాంటివి హైరిస్క్ రుగ్మతల కేటగిరీలోకి వస్తాయి. ఈ వ్యాధిగ్రస్తులు చాలాకాలం పాటు శక్తిమంతమైన మందులు, పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. అవన్నీ శరీరంపై దుష్ప్రభావం చూపుతాయి. మూత్రపిండాలనూ దెబ్బతీస్తాయి. కాబట్టి, ఆ పరిధిలోకి వచ్చేవారు కనీసం సంవత్సరానికి ఒకసారి కిడ్నీల పనితీరు పరీక్షలు చేయించుకోవాల్సిందే.
మూత్రపిండాలపై మందుల ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి.. అక్యూట్ కిడ్నీ డిసీజ్, సంక్షిప్తంగా ఏకేడీ. రెండోది.. క్రానిక్ కిడ్నీ డిసీజ్. దీన్నే సీకేడీగా వ్యవహరిస్తారు. తరచూ ఏకేడీకి గురయ్యేవారు సీకేడీ దశలోకి వెళ్లిపోయి, చివరికి డయాలసిస్ స్థితికి చేరుకుంటారు. సాధారణంగా, తొంభై రోజుల్లోపు కిడ్నీ సమస్యలతో బాధపడే వారిని ఏకేడీ రోగులుగా పరిగణిస్తారు. తొంభై రోజులు దాటితే సీకేడీ రోగుల కింద
లెక్క కడతారు.
కొన్నిరకాల మందులు వాడుతున్న సమయంలో మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. అలా రోగి మూత్రపిండాల సామర్థ్యం తగ్గిపోయిన మొదటి ఏడు రోజుల కాలాన్ని ‘అక్యూట్ కిడ్నీ ఇంజురీ’గా పరిగణిస్తారు. ఆ తర్వాత నుంచి.. 90 రోజులలోపు వరకు ‘అక్యూట్ కిడ్నీ డిసీజ్’ అంటారు. మందులు మానేసిన తర్వాత, అక్యూట్ కిడ్నీ డిసీజ్ రోగుల్లో మూత్రపిండాల పనితీరు మళ్లీ మెరుగుపడవచ్చు. తాత్కాలికంగా రోగికి ఉపశమనాన్ని కలిగించే కొన్ని ఔషధాలు మూత్రపిండాల విషయంలో మాత్రం.. దీర్ఘకాలంలో విషతుల్యంగా మారతాయి. ప్రాణాంతకం అవుతాయి. అవి…
దీర్ఘకాలం నుంచి కిడ్నీ సమస్యలు ఉన్న రోగులు క్రమంగా డయాలసిస్ వైపు వెళ్తారు. అంటే, మూత్రపిండాల వైఫల్యానికి చేరువ అవుతారు. మనదేశంలో ఏటా కొత్తగా 2 లక్షల నుంచి 5 లక్షల మంది డయాలసిస్ దశకు చేరుతున్నారు. వీరిలో సంవత్సరానికి 10 వేల మందికి మాత్రమే మూత్రపిండాల మార్పిడి జరుగుతున్నది. మిగిలిన 4.9 లక్షల మంది డయాలసిస్‌పైనే ఆధారపడాల్సి వస్తున్నది. దీనికి ప్రధాన కారణం మధుమేహం, అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) తదితర కారణాలతోపాటు యథేచ్ఛగా పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్ వాడటం. దీంతో కిడ్నీలు పూర్తిగా దెబ్బతింటాయి. ఫలితంగా అక్యూట్, క్రానిక్ కిడ్నీ డిసీజ్లకు గురవుతున్నారు. అంటే, పదేండ్ల తర్వాత రావాల్సిన డయాలసిస్ దశ రెండేండ్లకే వచ్చేస్తున్నది.
శరీరంలో వ్యర్థ జలాలు (యూరెమిక్ టాక్సిన్స్) పేరుకుపోవడం వల్ల పొటాషియం, ఆమ్లాలు పెరిగిపోయి, రక్తంలో పోగైన సీరం క్రియాటినిన్ ఇతర శరీర భాగాల పనితీరుమీద దుష్ప్రభావం చూపుతుంది. అప్పుడు రక్తంలో విషపూరిత పదార్థాలు అధికమైపోయి, ఆకలి పూర్తిగా మందగిస్తుంది. ఇలాంటివి డయాలసిస్ చేయించుకోవడానికి సంకేతాలుగా చెప్పవచ్చు.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మూత్రపిండాల పనితీరు పరీక్షలు చేయించుకోవాలి. ఆ నివేదికల ఆధారంగా నిపుణులు మందుల డోసేజీ నిర్ణయిస్తారు. కిడ్నీలపై చెడు ప్రభావం చూపే మందులను మార్చడమో, డోసేజీ తగ్గించడమో చేస్తారు. అదే సమయంలో.. సీరం క్రియాటినిన్, ఈజీఎఫ్ఆర్ (ఎస్టిమేటెడ్ గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్), యూరినరీ ప్రొటీన్ ఎస్టిమేషన్.. పరీక్షలు రుగ్మతను బేరీజు వేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. రక్తంలో క్రియాటినిన్ పెరిగినా, మూత్రంలో ప్రొటీన్ పెరిగినా మందులు మార్చాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ‘నెఫ్రో టాక్సిక్’ మందులు వాడకూడదు. ఇవి నేరుగా మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. వైద్యుడి సిఫారసు లేకుండా.. ప్రతి చిన్నదానికి మందులు వాడటం మంచిదికాదు. అందులోనూ పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్ అస్సలు వాడకూడదు. తరచూ ఎసిడిటీ మందులు (పాంటోప్రాజోల్ మొదలైనవి) వేసుకోవడం ప్రమాదకరం.
ఏ వ్యాధి విషయంలో అయినా చికిత్సలు, శస్త్రచికిత్సలకంటే ముందస్తు జాగ్రత్తలే ఉత్తమం. ప్రతి రుగ్మతకు ముందు శరీరం కొన్ని సంకేతాలను పంపుతుంది. వాటిని అర్థం చేసుకోవాలి. జాగ్రత్తపడాలి. జీవనశైలి మార్చుకోవాలి. దురలవాట్లను వదిలించుకోవాలి. మూత్రపిండాలకు సంబంధించి.. మూత్ర విసర్జనలో వచ్చే మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. తరచుగా మూత్ర విసర్జన జరిగినా, మూత్రంలో రక్తం కనిపించినా, బుడగలు, నురగలు ఎక్కువైనా, కళ్ల చుట్టూ ఉబ్బు ఏర్పడినా.. ప్రమాద సంకేతాలుగానే అర్థం చేసుకోవాలి. తక్షణం వైద్యులను సంప్రదించాలి. చిట్కాలు, పసరు మందులను ఆశ్రయించడమంటే నిండు ప్రాణాలను బలిపెట్టడమే.
మరీ ముఖ్యంగా, మధుమేహ వ్యాధిగ్రస్తులు మూత్రపిండాల పట్ల మరింత జాగ్రత్త వహించాలి. కిడ్నీలు పూర్తిగా పనికిరాకుండా పోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే, డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడంతో పాటు, తగిన జాగ్రత్తలు పాటించాలి. మధుమేహాన్ని మందులతో, ఆహార నియమాలతో అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంటాం. ఇది అక్షరాలా నిజం. అయితే ఈ రుగ్మతతో పాటు, ఇతరత్రా ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల చికిత్సలు మూత్రపిండాల మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా చాలావరకు దెబ్బతినే వరకూ మూత్రపిండాలు ఎటువంటి లక్షణాలనూ బయల్పరచవు. కాబట్టి, సమస్యను మొదట్లోనే పసిగట్టడం కోసం క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
రక్తంలో చక్కెర అదుపు తప్పితే, మూత్రపిండాలు ప్రొటీన్‌ను వడగట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయి. దాంతో మూత్రంతోపాటు ప్రొటీన్‌ను కోల్పోతూ ఉంటాం. కాబట్టి, మధుమేహాన్ని గుర్తించిన తొలినాళ్లలో మందులు వాడుకుంటూ, చక్కెర అదుపులోకి వచ్చేవరకూ ప్రతిరోజూ గ్లూకోమీటరుతో షుగర్ పరీక్షించుకుంటూ ఉండాలి. చక్కెర అదుపులోకి వచ్చిన తర్వాత వారానికోసారి, తర్వాత రెండు వారాలకోసారి, తర్వాత నెలకోసారి, మూడు నెలలకోసారి పరీక్షించుకుంటూ ఉండాలి. దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్నవాళ్లు నెలకొకసారి తప్పనిసరిగా ఫాస్టింగ్ షుగర్ పరీక్షించుకోవాలి.
కిడ్నీ డ్యామేజీ ఆలస్యంగా బయల్పడుతూ ఉంటుంది. లక్షణాలు ఆలస్యంగా మొదలవడమే ఇందుకు కారణం. ఒక కిడ్నీ పాడైనా, రెండోది ఆ భారాన్నంతా భరిస్తూ సమర్థంగా (హైపర్ ఫిల్ట్రేషన్) పనిచేస్తుంది. దాంతో దీర్ఘకాలంలో ఉన్న ఆ ఒక్క కిడ్నీ కూడా డ్యామేజీ అవుతుంది. కాబట్టి ప్రతి ఆరు నెలలకోసారి చక్కెర, రక్తపోటు పరీక్షతోపాటు, మూత్రపిండాల పనితీరును తెలిపే ‘సీరం క్రియాటినిన్’ పరీక్ష కూడా చేయించుకుంటూ ఉండాలి. అలాగే మూత్రంలో ప్రొటీన్ లీకేజీ పరీక్ష కూడా చేయించుకుంటూ ఉండాలి. ఎటువంటి లక్షణాలూ లేకపోయినప్పటికీ, మధుమేహం ఉందని తెలిసినప్పటి నుంచి ఈ పరీక్షలన్నీ క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉంటే, మూత్రపిండాల డ్యామేజీకి ప్రారంభంలోనే అడ్డుకట్ట వేయవచ్చు.
– డాక్టర్. రాజశేఖర చక్రవర్తి సీనియర్ నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్
యశోద హాస్పిటల్స్ హైటెక్‌సిటీ, హైదరాబాద్