మా బాబు వయసు నాలుగేండ్లు. రెండు వారాలుగా పొద్దున లేచేసరికి.. మొహం, కాళ్లు వాచినట్టు ఉంటున్నాయి. దీంతో వైద్యుడిని సంప్రదించాం. యూరిన్ టెస్ట్ చేయించాలని చెప్పారు. ఆ నివేదికను బట్టి మూత్రంలోంచి ప్రొటీన్లు వెళ్తున్నట్టు నిర్ధారించారు. ఇది మూత్రపిండాలకు సంబంధించిన సమస్య అని తేల్చారు. ఎందుకో భయంగా ఉంది. ఈ ఇబ్బంది జీవితాంతం ఉంటుందా? కొంతకాలానికి తగ్గిపోతుందా? మీరే పరిష్కారం చెప్పాలి.
– ఓ పాఠకురాలు
మీరు చెప్పిన వివరాలను బట్టి మీ బిడ్డలో నెఫ్రాటిక్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్య ఉన్నవారికి శరీరంలోని ప్రొటీన్లు మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తాయి. రక్తనాళంలోని నీరు వివిధ భాగాలకు వచ్చి చేరుతుంది. ఆ ప్రభావమే ఇదంతా.
చాలామంది పిల్లల్లో ఈ ఇబ్బంది ఉంటుంది. మూత్రపిండాల వడపోతలో లోపం వల్ల ఇలా అవుతుంది. ఈ సమయంలో స్టెరాయిడ్స్ లాంటి మందులు ఇచ్చి నయం చేస్తారు. పాతికశాతం మేర తిరిగిరాకపోవచ్చు. కాబట్టి, పీడియాట్రీషియన్‌ను కానీ, పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్‌ను కానీ సంప్రదించడం ఉత్తమం. రెగ్యులర్ చెకప్‌తో పాటు క్రమం తప్పకుండా మందులు వాడటం, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం ముఖ్యం. కొద్ది వారాల్లో తగ్గిపోయినా సరే, పూర్తి కోర్సును అనుసరించాలి.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్