మలబద్దకం సమస్య సర్వసాధారణంమైనప్పటికీ రోజుల తరబడి నిర్లక్ష్యం చేస్తే మాత్రం పలు దీర్ఘకాలిక రోగాలు ఖాయమంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా మందిరెండు మూడు రోజులకోసారి గాని మోషన్‌కు వెళ్లరు. అలాంటి వారికి సహజసిద్దమైన ఆహారమందిస్తే ప్రతి రోజూ కడుపు చిటికెలో ఖాళీ అవుతుంది. పిల్లలకు పీచు పదార్థం(Fiber) అధికంగా ఉండే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి ఆహారాన్ని పిల్లలకు అందించడం వల్ల మలవిసర్జన సాఫీగా జరిగేందుకు పీచు దోహదపడుతుంది.

గ్లాసు గోరువెచ్చని నీటితో..
ప్రతి ఉదయం పిల్లలకు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు(Warm water) ఇవ్వాలి. రాత్రంతా నానబెట్టిన ఎండు ద్రాక్షలను నాలుగైదు తినిపించాలి. రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలలో అర చెంచా ఆవు నెయ్యి కలిపి తాగిస్తే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. కలబంద గుజ్జును కడుపుపై రాయడం వల్ల కూడా ప్రయోజనముంటుంది. పిల్లలకు రోజంతా శరీరానికి సరిపడా నీరు తాగేలా చూసుకోవాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల మలం మృదువుగా మారి సులభంగా బయటకు వెళ్తుంది. నీరు, పండ్ల రసాలు, నిమ్మరసం వంటి హైడ్రేషన్ స్థాయిని పెంచడానికి సహాయపడతాయి.
పిల్లల స్నాక్స్ బాక్స్‌లో ఇవి ఉండేటట్లు చూసుకుంటే..

పిల్లలు స్నాక్స్ (Snaks Box) అడిగినప్పుడు కూడా వారి బాక్సులో పీచు ఎక్కువగా ఉండే యాపిల్, క్యారెట్ వంటి స్నాక్స్ బాక్స్‌లో పెట్టి ఇస్తే వాటితో బలవర్దకమైన విటమిన్స్ అందడంతో పాటు పీచు పదార్థం వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అరటిపండ్లు, స్ట్రాబెర్రీలను పెరుగుతో మెత్తగా చేసి ఆ మిశ్రమానికి ఒక టీస్పూన్ ఫ్లాక్స్ సీడ్ లేదా చియా సీడ్స్‌ను కలిపి ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పెరుగుతో..
ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పెరుగును పిల్లలకు ఇవ్వడం వల్ల జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను ఇది సృష్టించి మోషన్ సక్రమంగా అయ్యేందుకు దోహదపడుతుంది . నిర్దిష్ట సమయాల్లో టాయిలెట్‌ని ఉపయోగించాలని పిల్లలకు ఎప్పటికప్పుడు సూచిస్తే వారికి సహజంగానే మలవిసర్జన చేయాలనే కోరిక కలుగుతుంది.

పిల్లలు రోజుకు రెండుసార్లు కనీసం 10 నిమిషాలు టాయిలెట్లో ఉండేలా అలవాటు చేయాలి. పిల్లల్లో ఆహారం, ఆరోగ్యంపై చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు నేర్పిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఎదుగుతారన్న దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు.