Betel Leaves | తమలపాకులను కొందరు పాన్ వంటివి నమిలేందుకు ఉపయోగిస్తారు. కానీ ఆయుర్వేద వైద్యంలో ఎంతో పురాతన కాలం నుంచే తమలపాకులను ఔషధంగా ఉపయోగిస్తున్నారు. తమలపాకుల్లో అనేక ఔషధ గుణాలు, పోషక విలువలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. దీన్ని పలు ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. హిందువులు శుభ కార్యాల్లో తమలపాకులను వాడుతారు. అయితే తమలపాకులను రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. రోజూ రాత్రి భోజనం చేసిన అనంతరం ఒక తమలపాకును నేరుగా అలాగే నమిలి తినాలి. దీంతో అనేక లాభాలు ఉంటాయని వారు అంటున్నారు. తమలపాకులను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
తమలపాకులను తింటే జీర్ణ వ్యవస్థలో పలు ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి మెటబాలిజం పెరిగేందుకు సహాయం చేస్తాయి. దీంతో తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. పొట్టలో గ్యాస్ ఏర్పడకుండా ఉంటుంది. కడుపు ఉబ్బరం, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. తమలపాకులను తినడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. రుచి పెరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది. ఈ ఆకులను తింటే నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాల, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. తమలపాకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోట్లో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. దీని వల్ల నోటి దుర్వాసన తగ్గి నోరు తాజాగా మారుతుంది. కనుకనే రాత్రి పూట మన పెద్దలు, పూర్వీకులు కూడా తమలపాకులను నమిలి తినేవారు.
తమలపాకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. వీటిల్లో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి వాపులను, నొప్పులను తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. తమలపాకులను నొప్పులు, వాపులు తగ్గించే ఔషధంగా కూడా ఎంతో కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. తమలపాకులను తింటున్నా లేదా వాటిని కాస్త వేడి చేసి కాపడం పెట్టినా నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించడంలో సహాయం చేస్తాయి. దీంతో కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురి కాకుండా సురక్షితంగా ఉండవచ్చు. క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
గాయాలు, పుండ్లను మానేలా చేయడంలోనూ తమలపాకులు సహాయం చేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గాయాలు, పుండ్లను త్వరగా మానుస్తాయి. గాయాల వద్ద చర్మానికి మరమ్మత్తులను చేస్తాయి. తమలపాకులను పేస్టులా చేసి నేరుగా సంబంధిత చర్మ భాగంపై రాస్తుండాలి. దీంతో గాయాలు, పుండ్లు త్వరగా మాని వాపుల నుంచి ఉపశమన్ లభిస్తుంది. ఇన్ఫెక్షన్ అవకుండా చూస్తాయి. తమలపాకులు మన శ్వాసకోశ వ్యవస్థను సైతం ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఆకులను నమిలి తింటుంటే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఆస్తమా ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గాలి సరిగ్గా లభిస్తుంది. ఇలా తమలపాకులను నేరుగా నమిలి తింటుంటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.