మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల్లో ఉండే కాల్షియంను మన శరీరం శోషించుకునేందుకుకు విటమిన్ డీ ఎంతో అవసరం. ఇదే సమయంలో శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరుకు, దంతాలు, ఎముకలు దృఢంగా ఉండేందుకు కూడా విటమిన్ డీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే మన శరీరంలో విటమిన్ డీ తగినంతగా లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా విటమిన్ డీ లోపం ఉన్నవారు డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో విటమిన్ డీ ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటే డయాబెటిస్‌ను అదుపు పెట్టుకోవచ్చని నిపుణులు సెలవిస్తున్నారు.
విటమిన్ డీ లోపం ఉండి టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న పలువురు పేషెంట్లకు నిత్యం 5వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ మోతాదులో 6 నెలల పాటు సైంటిస్టులు విటమిన్ డీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆ పేషెంట్లలో ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరిగిందని, షుగర్ లెవల్స్ కొంత వరకు తగ్గాయని తేల్చారు. అందువల్ల విటమిన్ డీ ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటే డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చని అధ్యయనకారులు చెప్తున్నారు.
విటమిన్ డీ లోపించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాదు. డయాబెటిస్ వస్తుంది. కనుక ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే విటమిన్ డి మనకు అందడం చాలా ముఖ్యం. నిత్యం సూర్యకాంతిలో కొంత సేపు ఉండడం లేదా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తినడం ద్వారా ఈ విటమిన్‌ను పొంది తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.
విటమిన్ డీ సూర్యరశ్మితోపాటు పాలు, చేపలు, కోడిగుడ్లు, మటన్ లివర్, పుట్టగొడుగులలో ఎక్కువగా లభిస్తుంది. ఈ ఆహారాలను నిత్యం తీసుకుంటే విటమిన్ డి లోపం రాకుండా, డయాబెటిస్ బారిన పడకుండా చూసుకోవచ్చు.
విటమిన్ డీ సప్లిమెంట్లు వాడుకునే బదులుగా నిల్యం ఎండలో కాస్సేపు నిలబడేలా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వెలువడే సూర్యకిరణాల్లో విటమిన్ డీ లభిస్తుంది.
పోర్టొబెల్లో మష్రూమ్స్, ఆయిస్టర్ మష్రూమ్స్ తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డీ పొందవచ్చు
ప్రతి రోజు ఒక గ్లాసు చొప్పున పాలు, పెరుగు తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డీ ని పొందవచ్చు.
కోడిగుడ్డు పచ్చసొనలో కూడా విటమిన్ డీ దొరుకుతుంది.