మా బాబు వయసు 13 సంవత్సరాలు. ఆటల్లో, చదువులో చురుగ్గానే ఉంటాడు. కానీ, ఏడాదిగా ఎప్పుడూ ఫోన్‌తోనే ఉంటున్నాడు. స్కూల్‌కు వెళ్లినప్పుడు తప్ప.. మిగతా సమయమంతా ఫోన్ వదలడం లేదు. ఈమధ్య బాగా చిరాకు పడుతున్నాడు. ఏమైనా అంటే.. ఎదురు మాట్లాడుతున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. చదవడం కోసం ఫోన్ కావాలంటాడు. ఇంతకుముందు బాగా హుషారుగా ఉండేవాడు. ఈమధ్య తలనొప్పి అంటున్నాడు. డాక్టర్‌కు చూపించాం. ఏమీ ఇబ్బంది లేదన్నారు. ఫోన్ చూడటమే తలనొప్పికి కారణమా? ఇంకేమైనా కారణాలు ఉండొచ్చా? ఫోన్ వదలాలంటే ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు.
తలనొప్పి గురించి డాక్టర్‌కు చూపించామన్నారు. ఆయన పరీక్షలు చేసి అంతా బాగుంది అన్నారంటే.. ఏ సమస్యా లేదన్నట్టే! అయితే, అసలు మీరు ఏ డాక్టర్‌కు చూపించారనే విషయం చెప్పలేదు. ఒకవేళ మీరు కళ్ల డాక్టర్‌కు చూపించనట్టయితే.. ఒకసారి చూపించండి. చూపులో ఏదైనా తేడా ఉందేమో తెలుసుకోవాలి. ఇకపోతే.. మీ బాబు ఎప్పుడూ ఫోన్ పట్టుకొనే ఉంటున్నాడనీ, వేరే పనులు చేయడం లేదనీ, కోపం, చికాకు ఎక్కువ అవుతున్నదనీ, వాదనకు దిగుతున్నాడనీ చెబుతున్నారు. ఇవన్నీ కూడా టీనేజీ పిల్లల్లో జరిగే హార్మోన్ల ప్రభావం వల్ల కలిగే మార్పులు. పిల్లలు అప్పటివరకూ ప్రతిదానికీ తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు.
కానీ, టీనేజీలోకి రాగానే.. తనంతట తానుగా, ఇండిపెండెంట్‌గా అవ్వాలన్న ఆలోచనతో, తనచుట్టూ ఉండే అలాంటి పిల్లల ప్రభావంతో వారి ప్రవర్తనలో తేడా వస్తుంది. ఇది కొంతవరకూ వయసు కారణంగా వచ్చే సమస్యే! అయితే, దురదృష్టవశాత్తూ ఇప్పుడు చాలామంది పిల్లలు స్మార్ట్ఫోన్లకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. భోజనం చేసేటప్పుడు ఎవరూకూడా ఫోన్, టీవీ చూడకుండా ఉండాలి. పిల్లలేకాదు.. మీరుకూడా ఫోన్ పక్కన పెట్టేయాలి. చదువుకునే సమయంలోనూ బాబు గదిలో ఫోన్, ట్యాబ్, కంప్యూటర్ లాంటివి లేకుండా చూసుకోవాలి.
చదువులో అవసరం ఉన్నంతవరకే కంప్యూటర్ వాడుకునేలా చూడాలి. ఒకవేళ అవసరాన్ని బట్టి వాడుతున్నా.. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకండ్లపాటు చూస్తే.. కంటిమీద భారం పడకుండా ఉంటుంది. ఈ డిజిటల్ డివైజ్ అడిక్షన్ వల్ల పిల్లల్లో ప్రధానంగా కంటి సమస్యలు వస్తున్నాయి. వారి ప్రవర్తనలోనూ మార్పు వస్తున్నది. స్క్రీన్లకే అతుక్కుపోయి ఆరుబయట ఆటలకు దూరమై.. స్థూలకాయం బారిన పడుతున్నారు. ఇలా ఫోన్‌ను ఎక్కువగా వాడటం వల్ల చాలారకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఇకపోతే.. మీ బాబు ఫోన్లో ఏమేం చూస్తున్నాడు? చాటింగ్‌లో ఎలాంటి సంభాషణలు చేస్తున్నాడు? అనేవి తెలుసుకోండి. నిజానికి 13 సంవత్సరాల పిల్లవాడికి సొంతంగా ఫోన్ ఉండాల్సిన అవసరం లేదు.
కానీ, చుట్టుపక్కల పిల్లల ప్రభావం వల్ల ఫోన్ కోసం డిమాండ్ చేసి ఉండొచ్చు. కాకపోతే.. కొన్ని రూల్స్ పెట్టి చూసుకోవడం మంచిది. ఫోన్ చూస్తూ సరిగ్గా నిద్ర పోకపోవడం, కళ్ల నుంచి నీరుకారడం, కోపంతో బర్న్ అవుటై.. ఇంట్లో వస్తువులను పగలగొట్టడం లాంటి తీవ్రమైన సమస్యలు ఉంటే సైకాలజిస్టును కలిసి.. కౌన్సిలింగ్ ఇప్పించడం మంచిది. మరో ముఖ్య విషయం.. ఈ డిజిటల్ డివైజ్‌లను పెద్దవాళ్లు కూడా అవసరం ఉన్నమేరకే వాడాలి. పిల్లలకు చెప్పడానికి ముందు.. మనమే ఫోన్ వాడటం తగ్గించాలి. కుటంబమంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు.. కబుర్లు చెప్పుకొంటున్న సమయంలో ఎవరూ ఫోన్ వాడకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేసినట్టయితే.. పిల్లల్లోనూ మార్పు వస్తుంది. కానీ, దురదృష్టవశాత్తూ ఈ సమస్య పెరుగుతూ వస్తున్నది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. దీన్ని అధిగమించవచ్చు.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్