Castor Oil In Navel | పూర్వం రోజుల్లో మన పెద్దలు ఆముదాన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. దీన్ని వంటల్లో వాడడంతోపాటు ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించే వారు. ఆముదంతో శరీరాన్ని మసాజ్ చేసి కాసేపు ఆగి స్నానం చేసేవారు. అప్పట్లో చిన్నారులకు కూడా ఆముదంతో మర్దనా చేసేవారు. ఆముదాన్ని జుట్టుకు కూడా ఎక్కువగా రాసుకునేవారు. అందుకనే అప్పట్లో వారికి అసలు జుట్టు సమస్యలు ఉండేవి కావు. అయితే మీకు తెలుసా.. ఆముదాన్ని బొడ్డులో వేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇప్పటికీ ఈ పద్ధతిని ప్రపంచ వ్యాప్తంగా పలు జాతులకు చెందిన వారు ఉపయోగిస్తుంటారు. ఆముదాన్ని బొడ్డులో వేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అనేక రోగాలకు ఇది ఔషధంగా పనిచేస్తుందని వారు అంటున్నారు.
మన శరీరంలో నాభి (బొడ్డు)ని కేంద్ర స్థానంగా చెబుతారు. బొడ్డు నుంచి అనేక నాడులు శరీరంలోని అన్ని అవయవాలకు అనుసంధానం అయి ఉంటాయి. ఈ క్రమంలో బొడ్డులో ఆముదం వేస్తే దాన్ని నాడులు గ్రహించి అవయవాలకు చేరవేస్తాయి. దీని వల్ల అవయవాలకు మేలు జరుగుతుంది. అవయవాలు ఉత్తేజం చెందుతాయి. యాక్టివ్గా పనిచేస్తాయి. అందుకనే బొడ్డులో ఆముదాన్ని వేయమని అనేక రకాల వైద్య విధానాల్లోనూ చెబుతుంటారు. ఈ విధంగా చేస్తే పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని అంటున్నారు. ఆముదంలో సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ నూనెను బొడ్డులో వేస్తే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యల నుంచి బయట పడవచ్చు.
బొడ్డులో ఆముదం వేయడం వల్ల చర్మం దాన్ని పీల్చుకుంటుంది. దీంతో చర్మం తేమగా మారుతుంది. పెదవులు పగలడం తగ్గుతుంది. పాదాల పగుళ్లు తగ్గుతాయి. పొడి చర్మం తేమగా మారుతుంది. చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది. చర్మానికి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. మహిళలు నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతుంటే నాభిలో ఆముదం వేయడం వల్ల నొప్పులు తగ్గుతాయి. ఆముదంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి పొట్టలో ఏర్పడే అసౌకర్యాన్ని తగ్గించడంతోపాటు కడుపు నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. దీంతో మహిళలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
ఆముదంలో సహజసిద్ధమైన డిటాక్సిఫయింగ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇది శరీరాన్ని అంతర్గతంగా క్లీన్ చేస్తుంది. ఆముదాన్ని బొడ్డులో వేస్తే శరీరంలోని లింఫ్ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. కీళ్ల నొప్పులు, కండరాల దృఢత్వం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు కొన్ని చుక్కల ఆముదాన్ని బొడ్డులో వేసి మసాజ్ చేయడం వల్ల తక్షణమే ఉపశమనం లభిస్తుంది. ఆముదంలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఈ నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. దీంతో కీళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలు పటుత్వాన్ని పొందుతాయి. ఇలా ఆముదాన్ని నాభిలో వేయడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.