హృదయ స్పందనలు నిరంతరాయంగా, నిర్విఘ్నంగా కొనసాగాల్సిందే. గుండె అలసిపోతే మనిషి కుదేలైపోతాడు. గుండె ఆగిపోతే మనిషి బతుకూ స్తంభిస్తుంది. రక్తాన్ని పంపింగ్ చేయగల సామర్థ్యాన్ని బట్టి గుండె సమర్థతను బేరీజు వేస్తారు. హృద్రోగులలో ఆ సత్తువను పెంచడానికి ‘కార్డియో రిహాబిలిటేషన్’ ఓ తిరుగులేని మార్గం.
గుండెకు ఎలాంటి సమస్య ఎదురైనా ఆ ప్రభావం గుండె పంపింగ్ సామర్థ్యంపైనా పడుతుంది. అంటే బ్లాక్‌లు ఏర్పడినా, గోడలు సన్నబడినా, పనితీరు దెబ్బతిన్నా, గుండెపోటు వచ్చినా.. అంతిమంగా పంపింగ్ పనితనమే దెబ్బతింటుంది. దీనివల్ల శరీరంలో వివిధ అవయవాలకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. రోగి మృత్యువుకు దగ్గరవుతాడు. సమస్య ఏదైనా అంతిమ పరిష్కారం ఒక్కటే.. గుండె పంపింగ్‌ను మెరుగుపర్చడం. ఇందుకు శస్త్రచికిత్సలు, ఔషధాలు, ఇతర వైద్య పద్ధతులు అందు
బాటులో ఉన్నాయి. అయితే ఒక్కసారి తగ్గిన గుండె పంపింగ్ సామర్థ్యాన్ని శాశ్వతంగా మెరుగుపరచలేం. ఎన్ని మందులు వాడినా అది తాత్కాలిక ఉపశమనమే. స్టెంట్లు, శస్త్ర చికిత్సలు కొంతవరకే పరిష్కారం చూపుతాయి. కానీ ఆ తర్వాత అనేకానేక పరిమితులు.. బరువులు ఎత్తకూడదు, మెట్లు ఎక్కకూడదు, పరుగెత్తకూడదు. అయితే, ఇలాంటి సందర్భాల్లో కార్డియో రిహాబిలిటేషన్ ఉత్తమ మార్గం. ఈ పద్ధతిలో కొన్నిరకాల ‘కార్డియో వాస్క్యులర్ ఎక్సర్సైజుల’తో గుండె పంపింగ్ సామర్థ్యాన్ని కొంతమేర పెంచవచ్చు. అసలు కార్డియో రిహాబిలిటేషన్ అంటే ఏంటి? ఎలాంటి గుండె సమస్యలు ఉన్నవారికి ఈ విధానం అనువైనది? దీనివల్ల పంపింగ్ సామర్థ్యం ఏ మేరకు మెరుగుపడుతుంది? అసలు ఇది సురక్షితమేనా? తదితర అంశాలను తెలుసుకుందాం.
కార్డియో రిహాబ్ అంటే..
హృద్రోగ సమస్యలతో బాధపడే వారికి ప్రత్యామ్నాయ వైద్య విధానం.. కార్డియో రిహాబిలిటేషన్. సాధారణంగానే హృద్రోగుల గుండె పంపింగ్ సామర్థ్యం పడిపోతుంది. దీనివల్ల మనిషి ప్రాణాపాయంలో పడతాడు. ఇలాంటి సమయాల్లో పంపింగ్ వేగాన్ని పెంచేందుకు వైద్యుల పర్యవేక్షణలో కార్డియో వాస్క్యులర్ వ్యాయామాలు చేయిస్తారు. ‘కార్డియో రిహాబిలిటేషన్’ను ఒక్కో రోగికి ఒక్కోలా ఇస్తారు. గుండె సమస్య, అనారోగ్య తీవ్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే హృద్రోగ నిపుణులు ఓ నిర్ధారణకు వస్తారు. బేరీజులో తేడా వస్తే గుండెపై తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోయే ఆస్కారం ఉంది.
ఎవరికి? ఎందుకు?
నాలుగు ప్రధాన పరిస్థితుల్లో రోగులకు కార్డియో రిహాబ్ ఇస్తారు. ఇందులో వివిధ రకాల కసరత్తులతో పాటు.. జీవనశైలి మార్పులు, ఆహార విధానంలో చేర్పులు, గుండె పనితీరుపై అవగాహన పెంచడం తదితర కార్యక్రమాలూ ఉంటాయి.
1. మైనర్ బ్లాక్స్‌కు..
గుండె రక్తనాళాల్లో స్వల్ప అవరోధాలు సహజం. దీనివల్ల ఎలాంటి సమస్యలూ ఉండవు. అదే మేజర్ బ్లాక్స్ విషయానికి వస్తే.. గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆయాసం, మెట్లు ఎక్కినప్పుడు, ఎక్కువగా నడిచినప్పుడు, పరుగెత్తినప్పుడు గుండెలో నొప్పి.. తదితర లక్షణాలు కనిపిస్తాయి. అయితే అన్నిరకాల బ్లాక్స్‌లో ఈ లక్షణాలు వెల్లడికాక
పోవచ్చు. లక్షణాలు లేని హృద్రోగులకు ఆంజియోగ్రామ్ పరీక్ష చేసినప్పుడే బ్లాక్స్ కనిపిస్తాయి. అంత మాత్రాన స్టెంట్స్ వేయనవసరం లేదు. ఆయాసం, గుండెలో నొప్పి మొదలైన లక్షణాలతోపాటు.. ఎనభై లేదా అంతకంటే అధికశాతం బ్లాకేజ్‌లు ఉంటేనే స్టెంట్స్ వేయాల్సి ఉంటుంది. ఇలా మైనర్ బ్లాక్‌లు ఉన్నవారికి కార్డియో రిహాబ్ మార్గంలో ‘కొలాటరస్’
(అదనపు రక్తనాళాలు) వృద్ధిచెంది గుండె ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉంటాయి.
2. డైలేటెడ్ కార్డియోమయోపతి
ఈ సమస్య ఉన్న రోగుల్లో గుండె పరిమాణం పెరుగుతుంది. దీంతో గుండె గోడలు పలచబడతాయి. ఫలితంగా గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. మద్యపానం, డ్రగ్స్ వంటివి తీసుకునే వారిలో, కొన్నిరకాల వైరల్ జ్వరాలు వచ్చినవారిలో ప్రధానంగా ‘డైలేటెడ్ కార్డియో మయోపతి’ సమస్య ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు ఏమిటన్నదీ తెలియదు. ఇలా అకారణంగా వచ్చే సమస్యను ‘ఇడియోపతిక్ హార్ట్ ఫెయిల్యూర్’ అంటారు. ‘డైలేటెడ్ కార్డియో మయోపతి’ రోగుల్లో సైతం కార్డియో రిహాబ్ ద్వారా గుండె పంపింగ్ సామర్థ్యాన్ని మెరుగు పరచవచ్చు. రిహాబ్‌లో చేయించే కార్డియో వాస్క్యులర్ వ్యాయామాల ఫలితంగా గుండె గోడలు దృఢంగా మారి పంపింగ్ సామర్థ్యం పెరిగే అవకాశాలు ఉంటాయి.
3. పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్
(పీఏహెచ్) రోగులకు.. ఊపిరితిత్తుల్లో కొన్ని రక్తనాళాలు కుదించుకుపోయి సన్నబడతాయి. దీనివల్ల ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడికి అవరోధం ఏర్పడుతుంది. దీంతో గుండె నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే రక్తం వెనక్కి నెట్టివేయబడి, బ్యాక్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఫలితంగాగుండెపై అదనపు భారం పడుతుంది.
దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు, జన్యుపరంగానూ, కొన్నిసార్లు ఎలాంటి కారణాలు లేకుండానే సమస్య ఎదురయ్యే అవకాశాలూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఉన్న రోగులకు సైతం కార్డియో రిహాబ్ ఇవ్వవచ్చు. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. ఫలితంగా రోగులు అలసట నుంచి ఉపశమనం పొందుతారు. చురుకైన జీవితం గడుపుతారు.
4. గుండె విఫలమైనప్పుడు
సాధారణంగా పంపింగ్ స్థాయి 30 శాతం కంటే తక్కువకు పడిపోతే, గుండె విఫలమైనట్లుగా పరిగణిస్తారు. గుండె వైఫల్యానికి చాలా కారణాలు ఉంటాయి. హార్ట్ ఫెయిల్యూర్ రోగులతోపాటు, కార్డియో వాస్క్యులర్ రోగులకు సైతం వ్యాయామాల ద్వారా గుండె పంపింగ్ సామర్థ్యం మెరుగు పర్చవచ్చు.
సాధారణ వ్యక్తి గుండె పంపింగ్ సామర్థ్యం-55 ఇ.ఎఫ్ (ఇజక్షన్ ఫ్రాక్షన్)
గుండె పంపింగ్ రేటు 30 ఇ.ఎఫ్ కంటే తక్కువగా ఉంటేనే గుండె విఫలమైనట్లు పరిగణిస్తారు.
రిహాబ్ ఇలా చేస్తారు..
కార్డియో రిహాబ్‌లో భాగంగా.. కార్డియో వాస్క్యులర్ వ్యాయామాలను వారానికి మూడుసార్లు చేయిస్తారు. ప్రతి వ్యాయామం నిడివి గంట నుంచి గంటన్నర పాటు ఉంటుంది. రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా 3 నెలల నుంచి 6 నెలలపాటు ఈ కోర్సు చేయాల్సి ఉంటుంది. నిపుణుడైన వైద్యుడి పర్యవేక్షణలో.. రోగి గుండె ఎంత లోడ్ తట్టుకోగలుగుతుంది అనేది ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ.. వ్యాయామాలు కొనసాగిస్తారు. కార్డియో పల్మనరీ ఎక్సర్సైజ్ టెస్టింగ్ (సీపీఈటీ) ద్వారా రోగి ఏ మేరకు ప్రాణవాయువును తీసుకుంటున్నాడన్నది గమనంలోకి తీసుకోవడమూ జరుగుతుంది. ట్రెడ్మిల్, సైకిల్ ఎర్గోమీటర్, ఆర్మ్ ఎర్గోమీటర్స్టెప్ ఏరోబిక్స్ తదితర పరికరాలను కసరత్తు కోసం వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో కుటుంబ సభ్యుల పాత్ర కూడా కీలకమే. ఆ సంక్షోభ సమయంలో రోగికి మనోబలాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఆత్మీయులదే.
ముప్పు కారకాలు (రిస్క్ ఫ్యాక్టర్స్)
రిహాబ్‌లో భాగంగా రోగుల్లో ఉన్న ముప్పు కారకాలను గుర్తిస్తారు. అనంతరం ఆ కారకాల గురించి రోగికి ఉన్న అవగాహనను తెలుసుకుంటూ, అనుమానాలను నివృత్తిచేయడంతో పాటు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. ధూమపానం, మద్యపానం తీవ్ర వ్యసనంగా మారిన రోగులకు అవసరమైతే, సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్‌కు పంపుతారు, కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. మొత్తానికి రీహాబ్ వల్ల రోగి జీవన విధానం మారడమే కాకుండా, హృద్రోగ భయం నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది.
డాక్టర్ మరళీధర్ బాబి
అసిస్టెంట్ ప్రొఫెసర్
కన్సల్టెంట్ కార్డియాక్ రిహాబ్ స్పెషలిస్ట్
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, సనత్‌నగర్
-మహేశ్వర్‌రావు బండారి