శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నది. సమాంతరంగా రోగాలూ అధికం అవుతున్నాయి. అందులోనూ క్యాన్సర్ వ్యాధులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నా.. వ్యాధిగ్రస్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొత్త కేసులు వైద్య ప్రపంచానికి సవాలు విసురుతున్నాయి. అందులోనూ.. ఓ ఐదు క్యాన్సర్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి.
క్యాన్సర్ రెండు రకాలుగా దాడిచేస్తుంది. మొదటిది జన్యుపరమైంది. వంశపారం పర్యంగా వస్తుంది. రెండోది, వివిధ కారణాల వల్ల దాపురిస్తుంది (స్పొరాడిక్). జన్యుపరమైన క్యాన్సర్‌కు 10 నుంచి 15 శాతమే ఆస్కారం ఉంది. స్పొరాడిక్ క్యాన్సర్‌కు 85 శాతం అవకాశం ఉంది. వీటికి కుటుంబ నేపథ్యంతో నిమిత్తం లేదు. కచ్చితమైన ఆధారాలు కనిపించకపోయినా.. మానవ తప్పిదాలు, వాతావరణ పరిస్థితులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా జీవన శైలి లోపాలు, అనారోగ్య కరమైన ఆహారపు అలవాట్లు, అపసవ్య జీవన విధానం, వాతావరణ కాలుష్యం, ఇన్ఫెక్షన్లు, అధిక బరువు, మితిమీరిన హార్మోన్ ఇంజెక్షన్ల వాడకం.. మొదలైనవి క్యాన్సర్‌కు దారితీస్తాయి. అందరి విషయంలో కాకపోయినా.. వయసు పెరిగే కొద్దీ మనిషి క్యాన్సర్‌కు దగ్గరవుతున్నట్టే లెక్క. కాకపోతే, వృద్ధాప్యంలో వచ్చే క్యాన్సర్లు నెమ్మదిగా విస్తరిస్తాయి. అదే, యుక్త వయసులో వేగంగా ప్రభావం చూపుతాయి. పాశ్చాత్య దేశాలతో పోల్చితే మన దగ్గర సమస్య తీవ్రంగా ఉన్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. పాశ్చాత్య దేశాల్లో 50-60 ఏండ్లు దాటిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వస్తుండగా.. భారత్‌లో మాత్రం 40 ఏండ్ల లోపే రొమ్ము క్యాన్సర్ బారినపడుతున్నారు.
దశాబ్దం క్రితం.. నలభై అయిదు నుంచి యాభై ఏండ్ల వారిలో క్యాన్సర్ లక్షణాలు కనిపించేవి. కానీ, మారుతున్న పరిస్థితుల కారణంగా 35 ఏండ్లలోపే ఆ ప్రభావానికి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది క్యాన్సర్ రోగులు ఉండగా.. అందులో లక్ష మంది ఒక్క తెలంగాణలోనే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మధ్యకాలంలో ‘ఇన్వాల్వ్మెంట్ ఏజ్ గ్రూప్’ 45 నుంచి 35కు తగ్గింది. గతంలో 35 ఏండ్ల వయసు వారిలో కేవలం1 నుంచి 2 శాతం మధ్య రోగులు ఉంటే.. ప్రస్తుతం అది ఇరవై శాతానికి పెరగడం ఆందోళన కలిగించే విషయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం గడిచిన ఐదేండ్లలో క్యాన్సర్ కేసులు 20 శాతం పెరిగాయి. 2030 నాటికి అది 50 శాతానికి చేరుకోవచ్చని అంచనా. విస్తరణలో, ప్రభావంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న క్యాన్సర్ల్లు ఇవి..
క్యాన్సర్ వ్యాధులు పలు రకాలు. అందులో ముఖ్యంగా మహిళలకు ఎక్కువగా సోకేది రొమ్ము క్యాన్సర్. ఇది.. బ్రెస్ట్ క్యాన్సర్ జీన్.. ‘బ్రకా-1’, ‘బ్రకా-2’ ఉత్పరివర్తన (మ్యుటేషన్) వల్ల వస్తుంది. జన్యువులలో కలిగే మార్పులు నేరుగా కణ విభజనపై ప్రభావం చూపుతాయి. ప్రత్యేకించి రొమ్ము ప్రాంతంలో కణాల విభజన సరిగ్గా జరగకపోవడంతో రొమ్ము క్యాన్సర్ దాపురిస్తుంది. ఇతర క్యాన్సర్లతో పోలిస్తే.. రొమ్ము క్యాన్సర్ బాధితులే అత్యధికంగా ఉండటం బాధాకరమైన విషయం. 2021తో బేరీజువేస్తే ఈ ఏడాది రొమ్ము క్యాన్సర్ 12 శాతం నుంచి 13 శాతానికి పెరిగి, రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి చేరింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 12 శాతంతో స్థిరంగా ఉంది. అత్యధికంగా నోటి క్యాన్సర్లు 9 శాతం నుంచి 11 శాతానికి వృద్ధి చెందాయి.
కారణాలు
ఇతర క్యాన్సర్లకు లేని వెసులుబాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ఉంది. దీనికంటూ ఓ వ్యాక్సిన్ లభిస్తున్నది. దీంతో మహమ్మారిని ఆమడదూరంలో పెట్టవచ్చు. అయినా సరే, రోజురోజుకూ ఈ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. అవగాహన లోపంతో, అర్థంలేని భయాలతో చాలామంది మహిళలు వ్యాక్సిన్ వేయించుకోవడం లేదు.
కారణాలు
హ్యూమన్ పాపిలోమా (హెచ్‌పీవీ) వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. ఈ వైరస్ శృంగారం ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. వైరస్ బారినపడిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ రాకపోవచ్చు. అందులో, కొందరికి మాత్రమే సర్వైకల్ క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. చిన్న వయసులోనే దాంపత్య జీవితం ప్రారంభం కావడం, ఎక్కువమందితో లైంగిక సంబంధాలు, విశృంఖల శృంగారం.. హెచ్‌పీవీ వైరస్‌కు దగ్గర చేస్తాయి.
నోటికి వచ్చే క్యాన్సర్లను ఓరల్ క్యాన్సర్స్ అంటారు. చిగుళ్లు, దవడ, నాలుక, పెదాలు తదితర భాగాలకు ఇవి సోకుతాయి. చాలా సందర్భాల్లో ఏ పంటినొప్పితోనో చికిత్సకు వెళ్లినప్పుడు డెంటిస్ట్‌లు క్యాన్సర్ లక్షణాలను గుర్తించి అప్రమత్తం చేస్తుంటారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికం. హఠాత్తుగా దంతాలు వదులైపోవడం, ఆహారం మింగడంలో అసౌకర్యం, గొంతు నొప్పి, వేగంగా బరువు తగ్గిపోవడం, నోరు తెరవడంలో ఇబ్బంది.. ప్రధాన లక్షణాలు.
కారణాలు
పాన్ మసాలా, ధూమపానం, మద్యపానం నోటి క్యాన్సర్లకు ప్రధాన కారణాలు. దురలవాట్లను దూరం చేసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఏ చిన్న అసౌకర్యం కలిగినా వైద్యులను సంప్రదించడం.. ఓరల్ క్యాన్సర్‌ను దూరం పెట్టే మార్గాలు. మంచి ఆహారపు అలవాట్లూ ముఖ్యమే.
మనిషికి శ్వాసే ప్రాణం. ఊపిరితిత్తులు శ్వాస వ్యవస్థకు ఆధారం. ఊపిరితిత్తులకు సమస్య వస్తే.. దీర్ఘకాలంలో ప్రాణాలకే ముప్పు. మొత్తంగా రెండు ఊపిరితిత్తులలో లేదా ఏదో ఒక ఊపిరితిత్తిలో కణ విభజన అసాధారణంగా జరిగితే.. అది క్యాన్సర్‌కు దారితీస్తుంది. చాలామంది ఈ సమస్యను సాధారణ అనారోగ్యంగానే భావిస్తారు. ఎక్స్‌రే, స్కాన్ చేసినప్పుడే తీవ్రత తెలుస్తుంది. ఛాతీలో నొప్పి, స్వరంలో మార్పు, తరచూ న్యుమోనియా దాడి, ఎముకల నొప్పి, తీవ్రమైన తలనొప్పి.. ఈ క్యాన్సర్ రోగులలో కనిపించే ప్రాథమిక లక్షణాలు. ఎక్స్‌రే, సీటీస్కాన్, బయాప్సీ, బ్రాంకోస్కోపీ, పెట్, బోన్ స్కాన్.. తదితర పరీక్షలు రోగ నిర్ధారణలో సహకరిస్తాయి. ఇక ఉదర క్యాన్సర్ విషయానికొస్తే.. పొట్ట గోడలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల ఈ రుగ్మత ఇబ్బంది పెడుతుంది. దీర్ఘకాలం పాటు కడుపులో నొప్పి, అల్సర్స్‌ను నిర్లక్ష్యం చేస్తే పొట్ట క్యాన్సర్‌ను అక్కున చేర్చుకున్నట్టే.
కారణాలు
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు తొలి కారణం ధూమపానమే. హానికర రసాయన పరిశ్రమలలో పని చేయడం, విపరీతమైన పొగలో జీవించడం, కుటుంబ సభ్యులలో పొగతాగే అలవాటు.. ప్రధాన కారణాలు. ఇక, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే చాలామందిని ఉదర క్యాన్సర్‌కు దగ్గర చేస్తాయి. కుటుంబ చరిత్ర కూడా ఓ కారణం కావచ్చు.
పెద్దపేగు క్యాన్సర్‌ను కొలొరెక్టల్ క్యాన్సర్, పేగు క్యాన్సర్ అనీ పిలుస్తారు. స్త్రీపురుషులు ఇద్దరినీ తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మల బద్ధకం, మలంలో రక్తం, పొట్ట ఉబ్బరం, ఒకటి రెండు ముద్దలకే పొట్ట నిండిన భావన, తీవ్ర అలసట ప్రధాన లక్షణాలు.
కారణాలు
రెడ్‌మీట్ తొలి ముద్దాయి. ఫైబర్‌లేని ఆహారం కూడా కారణమే. ధూమపానం, మద్యపానం, కుటుంబ చరిత్ర, ఊబకాయం.. ప్రధాన శత్రువులుగా చెప్పవచ్చు. వ్యాయామం, ఫైబర్‌తో కూడిన ఆహారం, తరచూ వైద్య పరీక్షలు చేయించు కోవడం.. రుగ్మతను నిలువరించే మార్గాలు.
…మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ జయలత (రేడియాలజిస్ట్)
డైరెక్టర్, ఎంఎన్‌జె క్యాన్సర్
హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్, హైదరాబాద్.