Cancer Preventing Foods | క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యాధి వచ్చిందంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ప్రారంభ దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే చికిత్స చేసి క్యాన్సర్‌ను చాలా వరకు అదుపు చేయవచ్చు. కానీ ఆలస్యం అయితే మాత్రం ప్రాణాలను కోల్పోతారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అనేక రకాల క్యాన్సర్లు ప్రజలను కబలిస్తున్నాయి. అయితే నిత్యం మనం తీసుకునే ఆహారంలో పలు మార్పులను చేసుకుంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మన ఆహారంలో ఫైబర్, విటమిన్లు, ఫైటో న్యూట్రియెంట్లు అధికంగా ఉన్న వాటిని తీసుకోవాలి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. వాపులను తగ్గిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దీంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మనకు అందుబాటులో ఉండే ఈ ఆహారాల్లో సహజసిద్ధమైన బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే పసుపును తమ వంట ఇంటి సామగ్రిలో ఒకటిగా ఉపయోగిస్తున్నారు. దీన్ని ఆయుర్వేద ప్రకారం సూపర్ ఫుడ్‌గా కూడా చెబుతారు. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కూడా ఇది కలిగి ఉంటుంది. దీనికి క్యాన్సర్ కణాలను అడ్డుకునే శక్తి ఉంటుంది. కనుక రోజువారి ఆహారంలో పసుపును భాగం చేసుకోవాలి. పసుపు వేసి తయారు చేసిన నీటిని రోజూ తాగాలి. లేదా రాత్రి పూట పాలలో పసుపు కలుపుకుని తాగుతుండాలి. దీంతో క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే ఉసిరికాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్రీ ర్యాడికల్స్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని నివారిస్తుంది. దీంతో క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఆహారంలో ఉసిరిని భాగం చేసుకుంటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు.
వెల్లుల్లిలో అనేక శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణాశయ, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారిస్తాయి. రోజూ ఉదయాన్నే పరగడుపునే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటుండాలి. ఘాటుగా ఉందనుకునే వారు ఒక టీస్పూన్ తేనెతో కలిపి తినవచ్చు. వెల్లుల్లిని రోజూ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. అలాగే తులసి ఆకులు కూడా క్యాన్సర్ రాకుండా అడ్డుకోగలవు. వీటిల్లోనూ అనేక సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటాయి. తులసి ఆకులను రోజూ నేరుగా ఉదయాన్నే పరగడుపునే 4 తీసుకుని తినవచ్చు. లేదా తులసి ఆకులతో తయారు చేసే టీని సేవించవచ్చు. ఇవి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.
అవిసె గింజల్లో లిగ్నన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి హార్మోన్ ఆధారిత క్యాన్సర్లు రాకుండా చూస్తాయి. దీని వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. క్యాన్సర్ రాకుండా చూస్తాయి. కుంకుమ పువ్వు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ట్యూమర్ గుణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగుతుంటే ఊపిరితిత్తులు, లివర్, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మనం తరచూ తినే కాకరకాయ కూడా పలు రకాల క్యాన్సర్లను తగ్గించగలదని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయ రసాన్ని రోజూ సేవిస్తుంటే పాంక్రియాస్, పెద్దపేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చని అంటున్నారు. ఇలా మన ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.