లేత నవ్వులు మాయమౌతాయి. పాలబుగ్గలు నునుపు తగ్గుతాయి. ఆటపాటలు అటకెక్కుతాయి. ఒంటి బాధ పంటి బిగువున దాచుకోలేక పసిబిడ్డలు వణికిపోతారు. నిన్న మొన్నటి వరకూ ఏడాదికి 40 వేల నుంచి 50 వేల మంది చిన్నారులు క్యాన్సర్ బారిన పడేవారు. ఆ సంఖ్య ఇప్పుడు 60 వేల నుంచి 70 వేలకు పెరిగింది. అయినా,భయపడాల్సిన పనిలేదు. పిల్లల్లో క్యాన్సర్ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స అందిస్తే, కోలుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని భరోసా ఇస్తున్నారు వైద్య నిపుణులు. పిల్లల్లో కనిపించే ఏ అనారోగ్య లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఇంకేవో కారణాలతో ముడిపెట్టి నిర్లిప్తంగా వ్యవహరించకూడదు. ఎవరికి తెలుసు, అది క్యాన్సర్ అయినా కావచ్చు! ఎందుకంటే, పసిబిడ్డల మీద క్యాన్సర్ మెరుపుదాడి చేస్తుంది. తొంభై శాతం కేసుల్లో ఎలాంటి కారణాలూ ఉండవు. పెద్దవారిలో అయితే ధూమపానం, మద్యం, కాలుష్యం వంటి కొన్ని కచ్చితమైన అంశాలు కనిపిస్తాయి. పిల్లల్లో అలా చెప్పడం అసాధ్యం. 10 శాతం కేసుల్లో మాత్రం జన్యుపరమైన కోణాలను తోసిపుచ్చలేం. సాధారణంగా ప్రొటో ఆంకోజీన్స్ అనేవి మనిషిలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. వాటికి విరుగుడుగా.. యాంటీ ఆంకోజీన్స్ క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. ఆ యుద్ధంలో యాంటీ ఆంకోజీన్స్ చేతులెత్తేయగానే దాడి మొదలవుతుంది. ఇక ఎదిరించాల్సిందే, పోరాడాల్సిందే, గెలవాల్సిందే, బిడ్డను గెలిపించాల్సిందే.
ప్రధానంగా రెండు రకాలు..
మెదడు, వెన్నెముకలో కణుతులు, కిడ్నీలను ఇబ్బందులపాలు చేసే నెఫ్రోబ్లాస్టొమా, ఎముకల క్యాన్సర్ లాంటివి బాల్యాన్ని చుట్టుముట్టే ప్రమాదాన్ని పూర్తిగా తోసిపుచ్చలేం. కానీ, పిల్లల్లో ప్రధానంగా రెండు రకాల క్యాన్సర్లు కనిపిస్తుంటాయి. ఒకటి, ఎక్యూట్ ల్యుకేమియా (బ్లడ్ క్యాన్సర్), రెండు, సాలిడ్ ట్యూమర్స్.. అంటే కణుతులు ఏర్పడటం. పిల్లల్లో వచ్చే క్యాన్సర్లలో ల్యుకేమియా వ్యాధి సర్వసాధారణం. ఇక బ్లడ్ క్యాన్సర్లు రెండు రకాలు. ఒకటి.. ఏఎంఎల్ బ్లడ్ క్యాన్సర్ (20 శాతం కేసులు), రెండు.. ఏఎల్ఎల్ బ్లడ్ క్యాన్సర్
(80 శాతం కేసులు).
ఎక్యూట్ ల్యుకేమియా లక్షణాలు
దీర్ఘకాలిక జ్వరం.
రక్తస్రావం.
పొట్టలో వాపు.
ఆకలి తగ్గిపోవడం.
శోష గ్రంథుల పరిమాణం పెరగడం.
నొప్పులు.
బరువు తగ్గడం.
వ్యాధి నిర్ధారణ పద్ధతులు
సీబీపీ రక్త పరీక్షలు.
బోన్‌మ్యారో పరీక్ష.
ఫ్లో సైటోమెట్రీ పరీక్ష (ఏ రకమైన బ్లక్ క్యాన్సర్ అన్నది తెలుస్తుంది).
జన్యు పరీక్ష (ఈ పరీక్ష ద్వారా వ్యాధి రిస్క్ ఫ్యాక్టర్ తెలుసుకోవచ్చు).
చికిత్సా విధానాలు
కీమో థెరపీ.
సపోర్టివ్ కేర్ (పోషక విలువ, ఇన్ఫెక్షన్ నివారణ తదితర అంశాలకు సంబంధించి తగిన సలహాలు అందిస్తారు).
సాలిడ్ ట్యూమర్స్
శరీర భాగాలలో ఏర్పడే క్యాన్సర్ కణుతులను.. ‘సాలిడ్ ట్యూమర్స్’ అంటారు. అయితే, ప్రతి కణితీ క్యాన్సర్ ట్యూమర్ కాకపోవచ్చు. క్యాన్సర్ కణుతులను మాత్రమే సాలిడ్ ట్యూమర్స్‌గా పరిగణిస్తారు. ముఖ్యంగా బ్రెయిన్ ట్యూమర్, న్యూరో బ్లాస్టొమా, వెల్స్ ట్యూమర్ (ఇది కిడ్నీ నుంచి వస్తుంది), హెపటో బ్లాస్టొమా, లివర్ ట్యూమర్, లింఫొమస్ తదితర ట్యూమర్లను సాలిడ్ ట్యూమర్స్ అంటారు.
నిర్ధారణ ఇలా..
రోగిలో కనిపించే లక్షణాల ఆధారంగా వివిధ పరీక్షలు జరిపించి ట్యూమర్‌ను గుర్తిస్తారు.
పాథాలజీ ద్వారా బయాప్సీ జరిపి, ఏరకమైన ట్యూమర్ అన్నది నిర్ధారిస్తారు.
ఐహెచ్సీ (ఇమ్యునో హిస్ట్టో కెమిస్ట్రీ) పరీక్ష ద్వారా వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకుని,
ఆ మేరకు వైద్యం చేస్తారు.
వైద్య పద్ధతులు..
వ్యాధి ప్రారంభ దశలో ఉంటే శస్త్రచికిత్స, కీమో థెరపీలను సిఫారసు చేస్తారు.
వ్యాధి మూడు, నాలుగు దశల్లో ఉంటే శస్త్ర చికిత్స, కీమో, రేడియో థెరపీలను ఎంచుకోవచ్చు.
..ఒకటి మాత్రం నిజం. ముందు జాగ్రత్తతోనే బాల్యాన్ని క్యాన్సర్ నుంచి కాపాడుకోగలం. బిడ్డ ఒంటి మీద దీర్ఘకాలిక వాపులు కనిపించినా, చురుకుదనాన్ని కోల్పోయినా, తరచూ అనారోగ్యం పాలు అవుతున్నా, నిత్యం తలనొప్పి వెంటాడుతున్నా, వాంతులు అవుతున్నా, ఉన్నపళంగా బరువు కోల్పోయినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. నూటికి తొంభైశాతం సందర్భాల్లో అది క్యాన్సర్ కాకపోనూ వచ్చు. కానీ, పదిశాతం అవకాశం మాత్రం ఆ మహమ్మారికి ఎందుకు ఇవ్వాలి?
కోలుకున్న తర్వాత..
బిడ్డ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడిన తర్వాత కూడా దీర్ఘకాలిక వైద్య సంరక్షణ చాలా అవసరం. శరీర వ్యవస్థలో చిన్న మార్పు కనిపించినా నిపుణులను కలవాలి. కొన్నిసార్లు చిన్న నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. క్యాన్సర్ నుంచి కోలుకున్న పిల్లలకు గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువ, ఎదుగుదలలోనూ లోపాలు ఉండవచ్చు. పెద్దయిన తర్వాత సంతానలేమి ఇబ్బంది పెట్టవచ్చు. ఒకరకమైన క్యాన్సర్ తగ్గినా, మరోరకమైన క్యాన్సర్ దాడిచేసే ఆస్కారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఒకటే దారి. వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, సమర్థమైన చికిత్స అందించడం, కోలుకున్న తర్వాత కూడా తగిన సంరక్షణ అందించడం.. పోషకాలతో కూడిన ఆహారాన్ని ఇవ్వడం, మంచి జీవనశైలిని పరిచయం చేయడం.. తల్లిదండ్రుల బాధ్యత.
సాలిడ్ ట్యూమర్స్ లక్షణాలు
శరీరంలో ట్యూమర్ ఏర్పడిన భాగంలో వాపు ఉంటుంది.
ఛాతీలో కణితి ఏర్పడినప్పుడు తీవ్రమైన దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మెదడులో ట్యూమర్ ఏర్పడితే తలనొప్పి, వాంతులు, చూపు సన్నగిల్లడం, నడకలో సమస్య వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డాక్టర్ శిరీష రాణి
పిడియాట్రిక్ ఆంకాలజిస్ట్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, బంజారాహిల్స్
-మహేశ్వర్‌రావు బండారి