Cancer | ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, క్యాన్సర్ చికిత్స అందించే వైద్య సిబ్బంది కొరత భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారనుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అయితే క్యాన్సర్ రంగంలో పనిచేసే వైద్యులు, నర్సులు, నిర్ధారణ నిపుణులు, ఇతర ఆరోగ్య సిబ్బంది సంఖ్యను సమగ్రంగా పెంచగలిగితే, అనేక దేశాల్లో క్యాన్సర్ మరణాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రతిష్ఠాత్మక వైద్య జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనాల ప్రకారం, ప్రపంచ క్యాన్సర్ వర్క్‌ఫోర్స్‌ను విస్తృతంగా పెంచడం ద్వారా 55 దేశాల్లో క్యాన్సర్ మరణాలను 50 శాతానికి పైగా తగ్గించవచ్చని అంచనా వేశారు. ముఖ్యంగా ఆఫ్రికా, మధ్య అమెరికా, దక్షిణ ఆసియా దేశాలు ఈ చర్యల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.
క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స నిపుణుల సంఖ్య పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, ఓషియానియా ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొంది. అదే సమయంలో రేడియాలజీ, పాథాలజీ వంటి నిర్ధారణ, ఇమేజింగ్ రంగాల్లో నిపుణుల సంఖ్య పెంచడం ద్వారా మరింత పెద్ద స్థాయిలో మరణాల తగ్గుదల సాధ్యమవుతుందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. అధ్యయనం ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంరక్షణ రంగంలో సుమారు 100 మిలియన్ల మంది సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇందులో అత్యధిక కొరత నర్సుల విషయంలో ఉండనుంది. సుమారు 65 మిలియన్ల నర్సుల కొరతతోపాటు రేడియాలజీ, పాథాలజీ వంటి నిర్ధారణ నిపుణుల కొరత కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా దేశాలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని అంచనా వేశారు. 2050 నాటికి క్యాన్సర్ కేసులు సుమారు 21 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఈ భారాన్ని తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాలే ఎక్కువగా భరించాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. క్యాన్సర్ రోగుల మనుగడ రేట్లను పరిశీలించినప్పుడు దేశాల మధ్య గణనీయమైన అసమానతలు కనిపిస్తున్నాయి. ఆఫ్రికాలో క్యాన్సర్ రోగుల జీవన శాతం అత్యల్పంగా ఉండగా, ఆసియాలో కూడా అది తక్కువగానే ఉంది. మరోవైపు ఉత్తర అమెరికా, ఓషియానియా దేశాల్లో క్యాన్సర్ రోగుల మనుగడ రేట్లు గణనీయంగా మెరుగ్గా నమోదయ్యాయి. ఈ వ్యత్యాసాలకు ప్రధాన కారణాల్లో ఒకటి శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కొరతగా నివేదిక పేర్కొంది. సరైన నిర్ధారణ, సమయానికి చికిత్స, పరిశోధన సేవలు అందించడానికి తగిన నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరం. అయితే అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ వనరులు పరిమితంగా ఉండటం వల్ల క్యాన్సర్ చికిత్సలో అసమానతలు కొనసాగుతున్నాయి. అందుకే భవిష్యత్తులో పెరిగే క్యాన్సర్ కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే సాంకేతికత, శిక్షణ, మానవ వనరుల అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ నిర్ధారణకు అవసరమైన ఇమేజింగ్ సేవల్లో ఉన్న లోటుపాట్లను గుర్తించి సరిదిద్దడం కూడా అత్యంత కీలకమని అధ్యయనం పేర్కొంది. సరైన నిర్ధారణ లేకపోతే సరైన చికిత్స అందించడం కష్టమవుతుందని పరిశోధకులు వివరించారు.
నివేదిక అంచనాల ప్రకారం, క్యాన్సర్ రంగంలోని మానవ వనరులను విస్తృతంగా పెంచడం ద్వారా 2030 నుంచి 2050 మధ్య కాలంలో సుమారు 170 మిలియన్ల మరణాలను నివారించవచ్చని వెల్లడైంది. అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ స్థాయిలో లాభాలు చేకూరే అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది. క్యాన్సర్ సంరక్షణలో పెట్టే ప్రతి ఒక డాలర్ పెట్టుబడికి అనేక రెట్లు ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. క్యాన్సర్, వైద్య సిబ్బందికి సంబంధించిన సమగ్ర రిజిస్ట్రీలను ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, విద్యా, పరిశోధనా శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, అలాగే నిర్ధారణ పరికరాలు, చికిత్సా సేవలకు ప్రాప్యతను పెంచడం వంటి చర్యలను నివేదిక సిఫారసు చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ భారాన్ని తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.